కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Kannauj Accident) జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగి ఉన్న ఓ స్కూల్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు పాఠశాల విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, దాదాపు 20 నుంచి 35 మంది వరకు గాయపడ్డారు.
ప్రమాద సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా బృందావన్ విహారయాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని తిర్వా మెడికల్ కాలేజీకి తరలించారు. స్వల్ప గాయాలైన 22 మంది విద్యార్థులు ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు మరో విద్యార్థికి గాయాలు కావడంతో, మెరుగైన వైద్యం కోసం వారిని కాన్పూర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

