కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ వైద్యరంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు 1వ తేదీన కచ్చితంగా వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు, ఏజెన్సీ కాంట్రాక్టర్లకు గత నెల 9వ తేదీన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టమైన లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు.
అయినప్పటికీ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికులకు వేతనం అందలేదని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాలు అధికారులకు, సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్లకు విలువ లేదా? అని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి పి. సురేష్ ప్రశ్నించారు.
మంగళవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనం రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన దేశవ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో ‘జైల్ భరో’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని ఆరోపించారు. నూతన లేబర్ కోడ్స్ కార్మిక సంక్షేమ రాజ్యానికి మరణ శాసనాలుగా మారాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల లేబర్ కోడ్స్ రాష్ట్రంలో అమలు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. 1వ తేదీన వేతనాల చెల్లింపులో నిర్లక్ష్యంపై పోరాటానికి (Protest) సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి బ్రాంచ్ యూనియన్ అధ్యక్షులు రంగన్న, సీనియర్ నాయకులు బి. చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి దేవానంద్, నాయకులు ఎస్. పద్మ, లక్ష్మమ్మ, రజియా, నైసన్, అంజలయ్య, యాదయ్య, శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

