కలం, వెబ్ డెస్క్ : భారత షూటింగ్ దిగ్గజం, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా (49) (Jaspal Rana) దిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఇటీవల జర్మనీ నుంచి తిరిగి వస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు దిల్లీలోని సాకేత్ మ్యాక్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌కు చెందిన జస్పాల్ రాణా భారత షూటింగ్ రంగానికి ఎనలేని సేవలు అందించారు. 1994 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించిన రాణా.. ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో 9 స్వర్ణాలతో సహా మొత్తం 15 పతకాలను కొల్లగొట్టారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలోనూ దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు.
క్రీడాకారుడిగానే కాకుండా అద్భుతమైన కోచ్‌గానూ ఆయన ముద్ర వేశారు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ వంటి మేటి షూటర్లను తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుంది. క్రీడలతో పాటు రాజకీయాల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న రాణా.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా తెహ్రీ గర్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జస్పాల్ రాణా (Jaspal Rana) హఠాన్మరణం పట్ల క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

