కలం, వెబ్‌డెస్క్: ఈ రోజుల్లో సంగీతం వినడానికి, ఆఫీస్ కాల్స్ మాట్లాడడానికి చాలా మంది హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. జర్నీ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వినేందుకు, ఫోన్లు మాట్లాడేందుకు కూడా వీటిని వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో చెవుల ఆరోగ్యానికి (Ear Health) ఏది మంచిది? అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. దాని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్ ఏ పరికరాలు అయినా సక్రమంగా వాడితేనే వాటివల్ల ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్? అనేది మనం తెలుసుకుందాం.
ఇయర్‌బడ్స్
ఇయర్‌బడ్స్ అనేవి నేరుగా చెవుల్లో అమరిపోతాయి. దీనివల్ల శబ్ద తరంగాలు.. చెవిపొరకు చాలా దగ్గరిదాకా వెళ్లి వినికిడి శక్తిపై ప్రభావం చూపిస్తాయట. కాబట్టి ఇయర్‌బడ్స్ ఎక్కువసేపు వాడడం వలన వినికిడి శక్తి తగ్గి, చెవుల్లో చికాకుగా అనిపిస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాకుండా చెవుల్లో అసౌకర్యం, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే బయటి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు కొంతమంది ఫుల్ వాల్యూమ్‌ను పెట్టేస్తుంటారు. ఇది చెవులపై మరింత ఒత్తిడిని పెంచుతుందట. అందుకే నియంత్రిత వాల్యూమ్ దాటకుండా ఇయర్‌బడ్స్ వాడాలని సూచిస్తున్నారు నిపుణులు.
హెడ్‌ఫోన్స్
ఇయర్‌బడ్స్ తో పోలిస్తే ఓవర్-ఇయర్ హెడ్‌ఫోన్స్ కొంత వరకు బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే ఇవి చెవులకు బయటి భాగంలో ఉంటాయి. ఇవి చెవిపొరకు కొంత దూరంలో ఉండటం వలన శబ్ద ప్రభావం తక్కువగా ఉంటుందట. అంతేకాకుండా హెడ్‌ఫోన్స్‌లో మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయం ఉండటంతో చుట్టూ ఎక్కువ శబ్దం ఉన్నా వాల్యూమ్‌ను అధికంగా పెట్టాల్సిన అవసరం అంతగా ఉండదని చెబుతున్నారు. కాబట్టి ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే హెడ్‌ఫోన్స్ కొంత వరకు సేఫ్ అని నిపుణులు సూచిస్తున్నారు.
వినికిడి శక్తిపై ప్రభావం చూపకుండా పాటించాల్సిన నియమాలు
- వినికిడిని కాపాడుకునేందుకు నిపుణులు 60/60 నియమాన్ని పాటించాలని చెబుతున్నారు.
- అంటే గరిష్ఠ శబ్ద స్థాయిలో 60 శాతానికి మించి వాల్యూమ్ పెట్టుకోకూడదని సూచిస్తున్నారు.
- హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ బడ్స్‌ను ఒకేసారి 60 నిమిషాలకు మించి వినకూడదట.
- ప్రతి గంటకు ఒకసారి విరామం తీసుకోవాలట.
- ఈ విధంగా చెవులకు విశ్రాంతి కల్పించడం ద్వారా వాటివల్ల ఎదురయ్యే దుష్ప్రభవాల నుంచి బయటపడవచ్చని సూచిస్తున్నారు నిపుణులు.
చాలామంది వినికిడి సమస్యలు వృద్ధాప్యంలోనే వస్తాయని భావిస్తుంటారు. కానీ అది పొరపాటు. చిన్న వయసులో అలవాటైన వినికిడి పద్ధతులే భవిష్యత్తులో చెవుల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

