ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కలం, నకిరేకల్: మహిళాభ్యుదయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) కొనియాడారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 01, 07, 08, 09, 10, 11 వార్డులకు చెందిన మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ (Nakrekal) పట్టణంలో మొత్తం 8 వేలకుపైగా మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా వారిపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని గుర్తుచేశారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు సంధించారు. గత పాలకులు రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలు చేసి వెళ్లారని మండిపడ్డారు. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు, అందులో అత్యవసర వైద్య సేవల కోసం ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కడపర్తి గ్రామంలో రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో నిరుపేదలకు, అర్హులైన వారందరికీ త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>