కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్ (Mahabubnagar District Club) ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న భారీ భవనానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగిందని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతో అత్యున్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని అన్నారు. శుక్రవారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపల్, ఇతర సంబంధిత శాఖల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దాదాపు రూ. 12 కోట్ల రూపాయలతో జిల్లా క్లబ్ ప్రాంగణంలో నూతనంగా నాలుగు అంతస్తులతో ఓ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా ఎదురుగా జిల్లా కోర్టు, మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంతోపాటు పక్కనే జిల్లా పోలీసు కార్యాలయం లాంటి అత్యంత సున్నితమైన, కఠినమైన భద్రత, అనునిత్యం నిఘా, అధిక భద్రత గల రక్షణ ప్రాంతంలో ఇలాంటి భారీ భవనాన్ని నిర్మించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అనుమతిలేని డిస్ట్రిక్ట్ క్లబ్ (Mahabubnagar District Club) అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చివేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుని తాము ఆశ్రయించడం జరిగిందని సామాజిక కార్యకర్త ప్రవీణ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా కేసు తదుపరి విచారణ ఆగస్టు 19నకు వాయిదా వేసినట్లు ఆయన పేర్కొన్నారు.
విచారణలో భాగంగా జిల్లా క్లబ్‌కు ఎలాంటి అనుమతులు లేవని.. ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు వివరణ ఇవ్వగా, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించిందన్నారు. ఈ మేరకు జిల్లా క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులకు నోటీసులు జారీ చేయడం జరిగిందని ప్రవీణ్ తెలిపారు. హైకోర్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: డేటింగ్ యాప్స్‌తో డేంజర్.. యువతకు గైనకాలజిస్ట్ హెచ్చరిక!
Follow Us On : WhatsApp

