‘అందరికీ బీమా’ సరే.. పాత స్కీముల సంగతేంటి?

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ (Telangana Indiramma Family Insurance Scheme) పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కుటుంబ పెద్ద ఏ కారణంతో మరణించినా ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుందని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సుమారు 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ బీమా రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. కుటుంబంలో ఆదాయం తీసుకువచ్చే పర్సన్ చనిపోతే రూ.5 లక్షల పరిహారం అందించే ఈ స్కీమ్ ను ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2, 2026 నుంచి ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నా.. ఇప్పటికే ప్రవేశపెట్టిన బీమా స్కీమ్‌ల అమలు ఎలా? ఆ స్కీమ్‌లతో కలిపి ఇది అమలవుతుందా? ఆ స్కీమ్‌లన్ని రద్దు అయ్యి ఒకే గొడుగు కిందకు వస్తాయా? కాంగ్రెస్ ప్రభుత్వం మదిలో ఏముందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

ఇప్పటికే అమలవుతున్న బీమా పథకాలివే..

రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం రైతులు, చేనేత, మహిళ సంఘాల కోసం ప్రత్యేకంగా బీమా స్కీమ్‌లు అమలు చేస్తున్నది. వాటి ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది. రైతుల కోసం రైతు బీమాను తీసుకొచ్చిన ప్రభుత్వం.. దీని ద్వారా 18–59 వయస్సు ఉన్న రైతు ఏ కారణంగా చనిపోయినా రూ.5 లక్షల సొమ్ము అందుతున్నది. రైతు బీమా తరహాలోనే చేనేత కార్మికులకు నేతన్న బీమాను అమలు పరుస్తోంది. అయితే ఈ స్కీమ్ ద్వారా నేతన్నలకు రూ. 80,000 బీమా అందుతోంది. అటు స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం.. రూ. 10 లక్షల వరకు కవరేజ్ అయ్యేలా బీమాను ఇస్తుంది. ఇవేగాక క్యాబ్‑డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌ వంటి వారికి రూ. 5 లక్షల బీమా సౌకర్యమూ ఉన్నది. కొత్తగా వచ్చే స్కీమ్‌కు, వీటికి మధ్య కొన్ని తేడాలు ఉన్నందున సమన్వయం ఎలా అనేది అధికారుల స్థాయిలో చర్చగా ఉన్నది.

కొత్తగా ఇందిరమ్మ కుటుంబ బీమా

కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇందిరమ్మ బీమా పథకంలో కుటుంబం యూనిట్‌గా ఉంటుంది. దీంతో ఈ స్కీమ్ కుటుంబంలో కేవలం ఒక్కరికే వర్తిస్తుందనే ప్రచారం జనం మధ్యలో నెలకొన్నది. కుటుంబ పెద్దకు మాత్రమే వర్తించేలా ఉన్నందున కుటుంబ సభ్యుల ఆకస్మిక మృతికి ప్రయోజనం ఉండదేమోననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇతర పథకాలన్నీ లబ్ధిదారుల పేరుమీద ఉండడంతో ఇబ్బంది లేదని, కానీ ఇప్పుడు కుటుంబ పెద్దను మాత్రమే కొత్త స్కీమ్‌కు క్రైటీరియాగా తీసుకుంటున్నందున కుటుంబ సభ్యుల విషయంలో ఈ స్కీమ్‌తో ప్రయోజనం లేదనేది మేజర్ సందేహం. రైతుబీమా పథకంలో కుటుంబంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్త స్కీమ్ వస్తే ఇప్పటికే అమలులో ఉన్నవాటిని ప్రభుత్వం టచ్ చేయకుండా వదిలేస్తుందా? ఆ స్కీమ్ లబ్ధిదారులకు కొత్త స్కీమ్ వర్తించకుండా షరతు పెడుతుందా?.. ఇలాంటి సందేహాలకు సమాధానం రావాల్సి ఉన్నది.

కొత్త స్కీమ్ మార్గదర్శకాలతోనే క్లారిటీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి జీవిత బీమా అని తాజా బడ్జెట్‌లో ప్రకటించడంతో అర్హులైనవారిని గుర్తించే ప్రక్రియపై ఇప్పటికింకా అటు అధికారులకు, ఇటు ప్రజలకు క్లారిటీ లేదు. మార్గదర్శకాలను లాంఛనంగా విడుదల చేసిన తర్వాత స్పష్టత వస్తుంది. పాత, కొత్త స్కీమ్‌లను విలీనం చేయడమా?.. లేక వేటికవిగా విడివిడిగానే అమలవుతాయా?.. ఒక బీమా సౌకర్యాన్ని అందుకుంటున్నవారు కొత్త స్కీమ్‌కు కూడా అర్హులేనా?.. అప్లై చేసుకుంటే లబ్ధిదారులుగా ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా?.. స్వయం సహాయక మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే రూ. 10 లక్షల బీమాను కల్పించింది కొత్త స్కీమ్ పరిమితి రూ. 5 లక్షలే కావడంతో పాత స్కీమ్ నుంచి కొత్తదానికి షిప్ట్ అవుతారా?.. ఇలాంటి చిక్కులకు ప్రభుత్వం విడుదల చేసే గైడ్ లైన్స్ జవాబు చెప్పనున్నది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి కొత్త స్కీమ్ అమలులోకి రానున్నందున ఈ లోపే మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>