కలం, నకిరేకల్: రాబోయే రోజుల్లో ఎల్ నినో (El Nino) మూలంగా తలెత్తే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్లో ఎల్ నినో ప్రభావం, నివారణ చర్యలపై నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీ చామల, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham), అధికారులు పాల్గొన్నారు. ఎల్ నినో వల్ల తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు, పశుసంపద, భూగర్భ జలాలు, ఆహార భద్రత, కూలీలకు ఉపాధి వంటి విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటలు పండించడం ద్వారా రైతులకు మంచి ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు.
మురసు తుఫాను నేపథ్యంలో కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోకుండా వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే సీజన్లలో రైతులు సన్నధాన్యాన్ని పండించేలా చైతన్యం తెచ్చి, రైస్ మిల్లర్లు సన్న ధాన్యం సరఫరా చేసేలా ప్రోత్సహించాలని, మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లోనే ఉండి నీటి వృథాను అరికట్టాలని, ఆయిల్ పామ్ పెంపకం, పశుగ్రాస కొరత రాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని కోరారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్ నినోపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రజాప్రతినిధులతో సమీక్షించారని తెలిపారు. బోర్లు ఎండిపోయే పరిస్థితులు వచ్చాయని, డిసెంబర్, జనవరి నాటికి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రైతులు యాసంగిలో వరి వేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. విబిజి రాంజీ పనుల ద్వారా ఉపాధి కల్పిస్తూ భూగర్భ జలాలను కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.
నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. 1951 నుండి ఇప్పటి వరకు దేశంలో 16 సార్లు కరువు వస్తే 10 సార్లు తెలంగాణ ప్రభావితమైందని, ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉందని తెలిపారు. తాగునీటి కొరత వస్తే అవసరమైతే అద్దె బోర్లను ఏర్పాటు చేసి అయినా ప్రజలకు నీరు అందిస్తామని భరోసా ఇచ్చారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల మేజర్ పనులు పూర్తి చేసి చెరువులు నింపుతామన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, గ్రామాల్లో నీటి వనరుల విశ్లేషణ చేసి వృధాను అరికట్టాలన్నారు. వర్షపు బొట్టును భూమిలోకి ఇంకింపజేసేందుకు ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణం చేపట్టాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ ఆటపాటలతో ఎల్ నినో నివారణపై సదస్సుకు హాజరైన వారికి అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

