కలం, సిద్దిపేట : వర్గల్ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో (BC Welfare Hostel) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న ఆరె చరణ్ (16) అనే విద్యార్థి హాస్టల్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మర్కూక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన ఆరె చరణ్ వర్గల్‌లోని బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. రోజూలాగే పాఠశాలకు వెళ్లి వచ్చిన అనంతరం, హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు.
గమనించిన తోటి విద్యార్థులు, సిబ్బంది వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే చరణ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న హాస్టల్ సిబ్బంది విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, తమకు సమాచారం అందించి, తాము ఘటనా స్థలానికి రాకముందే మృతదేహాన్ని హాస్టల్ నుంచి ఆసుపత్రికి తరలించడంపై విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరణానికి గల కారణాలపై అనుమానాలు ఉన్నాయంటూ హాస్టల్ ఎదుట బాధితులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

