కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ వచ్చే నెల 5న తలపెట్టిన నిరాహారదీక్షను నివారించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) యాక్షన్ ప్లాన్ తయారుచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ నెల 24న సమర్పించిన మెమొరాండం నేపథ్యంలో అన్ని విభాగాలను జీఏడీ (సాధారణ పరిపాలన శాఖ) అప్రమత్తం చేసింది. ఆ మెమొరాండంలో ఉద్యోగులు పేర్కొన్న 57 ప్రధాన డిమాండ్లలో ఏయే శాఖకు చెందినవి ఏమున్నాయో పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటో, ఇప్పటివరకు చేపట్టిన యాక్షన్ టేకెన్ రిపోర్టును మే 1వ తేదీ లోగా అందజేయాలని ఆ సర్క్యులర్‌లో జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా స్పష్టం చేశారు. మెమొరాండంలోని డిమాండ్లలో పరిష్కారం ఆ డిపార్టుమెంటు స్థాయిలో లేనట్లయితే, లేదా ప్రభుత్వ నిర్ణయంతో ముడిపడి ఉన్నట్లయితే దానిమీన నోట్‌ను పంపాలన్నారు. జేఏసీ లేవనెత్తిన డిమాండ్లను అన్ని విభాగాలకు మార్చి 25ననే పంపామని గుర్తుచేశారు.
నిరాహార దీక్ష నివారణపైనే ప్రత్యేక దృష్టి :
ఇప్పటికే విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు కొన్ని రోజులు సమ్మె చేశారు. విద్యుత్ సరఫరాలో వారి పాత్రను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఆ శాఖ అప్రమత్తమైంది. చర్చల ద్వారా సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకున్నది. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. మూడో రోజున జేఏసీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం చర్చలు నిర్వహించి విరమణకు చొరవ తీసుకున్నారు. ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఉద్యోగుల జేఏసీ డిమాండ్లను పరిశీలించి మే 5న ఒక రోజు నిరాహారదీక్ష అవసరం లేకుండా చూడాలనుకుంటున్నది. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు (పెన్షనర్లు), ఉపాధ్యాయులు, కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్.. వీరికి చెందిన సుమారు 206 సంఘాలతో ఉద్యోగ జేఏసీ ఏర్పడింది. ఇప్పటికే ఒక రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఇప్పుడు నిరాహారదీక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ కోసం కార్యవర్గ సమావేశాన్ని వచ్చే నెల 14న షెడ్యూలు చేసుకున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వం డిమాండ్ల పరిష్కారంపై దృష్టి సారించింది.

