కలం, తెలంగాణ బ్యూరో: నమ్మక ద్రోహం, డిజిటల్ ఆస్తుల దుర్వినియోగం, ప్రాజెక్ట్ అప్పగింతలో అడ్డంకులు సృష్టించినందుకు ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో పాటు దాని ఎండీ, సీఈవో శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖలోని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం ఫిర్యాదు మేరకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ఏసీపీ రాంరెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డేటాను, సోర్స్ కోడ్‌ను, డిజిటల్ కంటెంట్‌ను పూర్తిగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి ఉన్నప్పటికీ నిరాకరించడంతో ఐటీ విభాగం ఈ ఫిర్యాదు చేసింది. డేటా మొత్తం తనదేనని, ప్రభుత్వానికి సంబంధం లేదంటూ అందజేయడానికి ససేమిరా అంటూ తిరకాసు పెట్టింది. యూజర్ల డేటాను ప్రైవేట్ అప్లికేషన్లకు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది డేటా చౌర్యం కింద నేరమని ఐటీ చట్టం ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న వివాదం..
రాష్ట్రానికి చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, నిర్వహణను గత ప్రభుత్వం 2017లో ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించింది. ఆ కాంట్రాక్టు మేరకు 2017 జనవరిలో ఐటీ అధికారులు వర్క్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఐటీ విభాగం రూ. 70 లక్షలు చెల్లించింది. దీనికి తోడు ప్రతీ నెల నిర్వహణ ఛార్జీలను కూడా చెల్లించింది. ఒప్పందం ప్రకారం, కాలపరిమితి ముగిసిన తరువాత ప్రాజెక్టు డేటా, సోర్స్ కోడ్, డిజిటల్ ఆస్తులపై పూర్తి హక్కులను తెలంగాణ ప్రభుత్వానికే అప్పగించాల్సి ఉంటుంది. అయితే మూడుసార్లు (2018 నుంచి 2025 వరకు) అవే నిబంధనలతో అప్పటి ప్రభుత్వం పొడిగించింది. కాలపరిమితి గతేడాది మే 31తో ముగిసింది. దీంతో, కొత్త సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పర్‌వ్యూ ఇండియా కన్సల్టింగ్ అండ్ సర్సీసెస్ కంపెనీ సంస్థ ఎల్–1 గా ఎంపికైంది. ఇదే సమయంలో, ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ సంస్థ కూడా ఈ టెండర్‌లో పాల్గొని, నిబంధనలను అంగీకరించింది. కానీ టెండర్ దక్కించుకోలేకపోయింది.
ఉద్దేశపూర్వకంగానే డేటా దుర్వినియోగం..
టెండర్ దక్కకపోవడంతో గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందం ప్రకారం డేటా మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగించి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందన్నది ఐటీ విభాగం అధికారుల వాదన. కానీ ప్రభుత్వానికి సహకరించడం మానేసిందని ఫిర్యాదులో ఐటీ ఆఫీసర్లు పేర్కొన్నారు. ఒప్పందానికి విరుద్ధంగా తప్పుడు యాజమాన్య పత్రాలతో ప్రభుత్వానికి చెందిన డేటాను తనదిగా ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ వాదిస్తున్నదని పేర్కొన్నారు. కొత్త సంస్థకు డేటా బదలాయింపు ప్రారంభించినా పదే పదే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిందని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం, యూజర్ల డేటాను ప్రైవేట్ అప్లికేషన్లకు మళ్లించడం తీవ్రమైన నేరమని పేర్కొనడంతో పోలీసులు ఎఫ్ఐఆర్‌లో సంబంధిత సెక్షన్ల కింద ఆ కంపెనీపైనా, దాని ఎండీ (సీఈఓ కూడా ఆయనే) కేసులు నమోదు చేశారు.
ఉద్యోగులకు సైతం సైబర్ క్రైమ్ నోటీసులు..
కేసు దర్యాప్తులో భాగంగా ట్రాన్సాక్షన్ అనలిస్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎం.శ్రీనివాసులును ఏప్రిల్ 25న అరెస్ట్ చేశారు. ఇతర నిందితులైన సంస్థ ఎండీ, సీఈవో శ్రీనివాస రావు కాటూరి, ప్రాజెక్ట్ మేనేజర్ కిరణ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని సమాచారం. వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ నివేదిక సమర్పించింది. ఒప్పందం ప్రకారం సదరు కంపెనీపై జరిమానాలతో పాటు భవిష్యత్ టెండర్లో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెట్టడం, నష్టపరిహారం వసూలు చేయడం లాంటి చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

