కలం, తెలంగాణ బ్యూరో: “రెండేసుకుని మాట్లాడేవారి మాటలను మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు.. వాటిని పట్టించుకోనూ వద్దు.. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు ఏడుస్తూ ఉంటారు.. మనం హాయిగా సంతోషిస్తూ మన పని మనం చేసుకుంటూ పోతున్నాం..” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) తనదైన శైలిలో కేసీఆర్‌ను, బీఆర్ఎస్ లీడర్లను పరోక్షంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ భవనానికి మంగళవారం సాయంత్రం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేవతలు యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసుల కులగురువు శుక్రాచార్యుడు దాన్ని భగ్నం చేయడానికి మారీచుడు, సుబాహుడుని వాడుకున్నాడని, ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఫామ్‌హౌజ్‌లో ఉన్న శుక్రాచార్యుడు మన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు మారీచుడు, సుబాహుడిని పంపాడని అన్నారు. మనందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
గ్రామసభల్లో తీర్మానంతో ఫ్యూచర్ సిటీలో చేరిక :
ఫ్యూచర్ సిటీకి ఉన్న ఫ్యూచర్‌ను అంచనా వేసుకుని చాలా మంది ప్రజలు వారి గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలంటూ తన దగ్గరకు వచ్చి విజ్ఞప్తి చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. గ్రామసభలు నిర్వహించి తీర్మానం చేయించి ఆ గ్రామాలను వారి కోరిక మేరకు కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలని స్థానిక నాయకులను ఆదేశించారు. భారత్ ఫ్యూచర్ సిటీని అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించుకుందామన్నారు. ఇక నుంచి ఇక్కడి నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడులను ఆహ్వానిద్దామని అన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ ప్రభుత్వం ఎవరికీ నష్టం కలగనీయదని భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి శ్రీధర్ బాబు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, పేదల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని ఇప్పటికే అధికారులకు సూచించానని గుర్తుచేశారు.
అప్పట్లో ఔటర్ రింగు రోడ్డుకూ ప్రజల్లో ఆందోళన :
ఒక కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదంటే ఆ ప్రాంతంలోని ప్రజల్లో కొత్త భయాలు, ఆందోళనలు ఉండడం సహజమేనని, గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణానికి కూడా ప్రజల్లో ఇలాంటి ఆందోళనలే ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. ఓఆర్ఆర్ అయ్యేదేనా అంటూ చాలామంది పెదవి విరిచారని, ఇప్పుడు 160 కి.మీ.లతో దేశంలోనే ప్రత్యేకమైనదిగా నిలించిందని, ఏ నగరానికీ ఇలాంటి సౌకర్యం లేదని గుర్తుచేశారు. ప్రజల సహకారంతో దేశంలోనే కాక ప్రపంచంలోనే అద్భుతమైన నగర నిర్మాణానికి ఫ్యూచర్ సిటీ రూపంలో వేగంగా అడుగులు పడతాయన్నారు. ప్రపంచంలో ఏ దేశానికి చెందినవారైనా ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెట్టేలా ఫ్యూచర్ సిటీని తీరిదిద్దుతామన్నారు.
ఏడు బుల్లెట్ ట్రెయిన్స్‌లో మూడు మనవే :
రైల్వే మంత్రిత్వశాఖ దేశంలో మొత్తం ఏడు బుల్లెట్ ట్రైన్స్‌ను మంజూరు చేస్తే అందులో మూడు మన రాష్ట్రానికే వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. బెంగుళూరు- హైదరాబాద్ , శంషాబాద్- పూణె, శంషాబాద్- అమరావతి- చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్‌కు మార్గం సుగమమైందన్నారు. రంగారెడ్డి జిల్లాలో అద్భుతం జరగబోతున్నదని, ఈ ప్రాంత ప్రజల సహకారంతో ఆ అద్భుతం ఆవిష్కృతమవుతుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఇవాళ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ భవనానికి శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు.
మిగిలిన మావోయిస్టులూ లొంగిపోవాలి : సీఎం అప్పీల్
రాష్ట్రంలో ఇప్పటివరకు మూడేండ్ల కాలంలో ఆపరేషన్ కగార్‌లో భాగంగా దాదాపు 900 మంది వివిధ స్థాయిల్లోని మావోయిస్టులు లొంగిపోయారని, వారి ఆయుధాలను సైతం ప్రభుత్వానికి అప్పగించారని గుర్తుచేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇంకా అజ్ఞాత జీవితంలో ఉన్నవారు సైతం లొంగిపోవాలని అప్పీల్ చేశారు. సరెండర్ అయిన మావోయిస్టుల ఆరోగ్య చికిత్స బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దీర్ఘకాలం అడవుల్లో పనిచేసిన వారికి చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉండడం సహజమేనని, వారికి మెరుగైన ట్రీట్‌మెంట్ ప్రభుత్వమే కల్పిస్తుందన్నారు. వారు శేష జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకోడానికి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, వారి జీవన భారాన్ని ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు సైతం సరెండర్ కావడానికి తెలంగాణ ప్రభుత్వమే బెస్ట్ అనే భావనతో ఉన్నారని, ఇప్పటికింగా అడవుల్లోనూ, అజ్ఞాతజీవితంలోనో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు.

