కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government )భారీ శుభవార్త చెప్పింది. త్వరలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు స్కూల్ పుస్తకాల ధరలు సుమారు 15 శాతం మేర తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టింది. ఒకటో తరగతి పుస్తకాల సెట్ ధర రూ.247 నుంచి రూ.209, పదో తరగతి పుస్తకాల సెట్ ధరను రూ.1,078 నుంచి రూ.900 తగ్గించనుంది. తద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం తగ్గించడంతో పాటు పాఠశాల విద్యను మరింత బలోపేతం చేయాలని భావిస్తోంది.
పేజీ ముద్రణ ఖర్చు తగ్గినందునే..
స్కూల్ పుస్తకాల ముద్రణకు ఇటీవల నిర్వహించిన టెండర్లలో తక్కువ కోట్ చేయడంతో పేజీల ముద్రణ ఖర్చు 54 పైసల నుంచి 44.5 పైసలకు తగ్గనుంది. దీంతో ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇంటర్ పుస్తకాల్లో భౌతిక శాస్త్రం పుస్తకం రేట్ రూ.273 నుంచి రూ.335కు పెరిగింది. మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ పుస్తకాల ధరలు మాత్రం తగ్గాయి. సీబీఎస్ఈ బోధించే ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం పుస్తకాల ధరలు యథావిధిగానే ఉంటున్నాయి. కేవలం పుస్తకాల ఖర్చే రూ.10 వేల వరకు ఉంటుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

