కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా (Rythu Bharosa) పథకానికి అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్దం చేసింది. సుమారు 70 లక్షల మంది రైతులకు కోటి 50 లక్షల ఎకరాలకు గాను రూ..6 వేల చొప్పున డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. ఇందుకు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని భావించిన ఆర్థిక శాఖ ఆ మేరకు వివిధ వనరుల ద్వారా సమీకరించుకుంది. ఈ నెల 30వ తేదీన ఖమ్మం జిల్లా చింతకానిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిధుల విడుదలకు శ్రీకారం చుట్టబోతున్నారు. జులై 15వ తేదీ నాటికి పూర్తిగా పంపిణీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఆర్బీఐ నుంచి భారీగా అప్పు..
జూన్, జులై నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతోంది. రైతు భరోసాకు రూ.9 వేల కోట్లు, పింఛన్లు, ఉద్యోగులకు బకాయిలకు రూ.2 వేల కోట్లు, వారి నెలవారీ వేతనాలు రూ.6 వేల కోట్లు, ఇతరత్రా పరిపాలన ఖర్చులు.. వెరసి ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.11,500 కోట్ల మేర రుణం సేకరించాల్సి వచ్చింది. ఇవి సరిపోని పక్షంలో రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొంత మేర వీటికి మళ్లించబోతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం జులై నెలలో సుమారు రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

