కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిన రైతు డిస్కమ్ (Farmer DISCOM) అప్పులతోనే తన లావాదేవీలను మొదలుపెడుతున్నది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరధ, జల మండలి, వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు.. ఇలాంటివన్నీ రైతు డిస్కమ్ పరిధిలోకి రానున్నాయి. ఇంతకాలం ఇవి ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల పరిధిలో ఉండగా ప్రభుత్వం థర్డ్ డిస్కమ్ ఏర్పాటు పేరుతో రైతు డిస్కమ్‌కు బదిలీ చేసింది. దీంతో వీటి వినియోగానికి సంబంధించిన బిల్లుల పేమెంట్ కాకుండా బకాయిలుగా ఉండడంతో రైతు డిస్కమ్‌కు రూ. 35,982 కోట్ల భారం పడుతున్నది. ఇవి కాక మరికొన్ని బకాయిలు ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల దగ్గరే ఉండిపోతున్నాయి. ఇవి కూడా కలపాల్సిన పరిస్థితి తలెత్తితే రైతు డిస్కమ్‌కు అదనంగా మరో రూ. 10 వేల కోట్ల భారం పడుతుంది. కొత్త డిస్కమ్ ఈ ఏడాది జూన్ 2 నుంచి ఫంక్షనింగ్‌లోకి రానున్నది. రెండు డిస్కమ్‌ల నుంచి రావాల్సిన బకాయిలు, ఆస్తులు, సిబ్బంది బదిలీ.. వీటన్నింటిపై ముమ్మరంగా కసరత్తు జరుగుతున్నది.
సింగరేణికి సైతం జెన్‌కో, డిస్కంల బకాయిలు :
కొత్తగా ఏర్పడుతున్న రైతు డిస్కమ్‌కు అప్పుల భారం ఇలా ఉంటే సింగరేణికి సైతం జెన్‌కో, డిస్కమ్‌లు భారీగానే బకాయి పడ్డాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును కొనుగోలు చేసినందుకు తెలంగాణ జెన్‌కో నుంచి దాదాపు రూ. 19 వేల కోట్లు, థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి కరెంటును కొనుగోలు చేసి వాడుకున్నందున రూ. 12 వేల కోట్లకు పైగా రెండు డిస్కమ్‌ల నుంచి బాకీలు పేరుకుపోయాయని సింగరేణి సంస్థ మొత్తుకుంటున్నది. ఒకవైపు ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల నుంచి పేరుకుపోయిన మొండి బకాయిలతో డిస్కమ్‌లు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ డిస్కమ్‌ల, జెన్‌కో వాడుకున్న బొగ్గు, విద్యుత్ రూపంలో సింగరేణికి సైతం బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ విభాగాల నుంచి ఎప్పటికప్పుడు బకాయిల్లేకుండా పేమెంట్స్ జరిగితే అటు డిస్కమ్‌లు, ఇటు సింగరేణి అప్పుల ఊబి నుంచి బయటపడతాయి.
బకాయిల పేమెంట్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం :
గృహ వినియోగదారులు లేదా కమర్షియల్ వినియోగదారుల నుంచి ప్రతి నెలా ముక్కు పిండి వసూలు చేసే డిస్కమ్‌లు ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల నుంచి వసూళ్ళ విషయంలో మాత్రం ఉదాసీనంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు భవనాల్లో నడుస్తున్న చాలా పంచాయతీ కార్యాలయాలు విద్యుత్ బిల్లులు కట్టకపోవడంతో కనెక్షన్‌ను కట్ చేసిన డిస్కమ్‌లు ప్రభుత్వ భవనాల బిల్లులను వసూలు చేయడంలో మాత్రం సీరియస్‌గా వ్యవహరించడంలేదు. ఉత్తర, దక్షిణ డిస్కమ్‌లు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ. 45,398 కోట్ల మేర వసూలు చేయాల్సి ఉన్నదని, దీర్ఘకాలంగా బిల్లులు పేమెంట్ చేయకుండా పెండింగ్‌లోనే ఉండిపోయాయని ప్రభుత్వమే థర్డ్ డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించిన జీవోలో పేర్కొన్నది. ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేక డిస్కమ్‌లు ఇబ్బంది పడుతున్నాయి. ఖజానాలో కాసులు లేవనే కారణంతో ప్రభుత్వమూ పేమెంట్ చేయకుండా పెండింగ్‌లో పెట్టింది.

