కలం, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (CV Anand) బుధవారం పంజాగుట్ట (Panjagutta) పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అక్కడ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఏఐ సాంకేతికత (సేతు కియోస్క్) పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు అకున్ సబర్వాల్, మహేష్ భగవత్లతో కలిసి ఆయన స్టేషన్లోని నూతన ఏర్పాట్లను తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులు అధికారుల కోసం వేచి చూసే అవసరం లేకుండా, అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏఐ యంత్రం ముందు నిలబడి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తే సరిపోతుంది. వారు చెప్పిన వివరాల ఆధారంగా ఏఐ యంత్రమే ఫిర్యాదు కాపీని ఆటోమేటిక్గా సిద్ధం చేస్తుందట. బాధితుడు చెప్పిన వివరాలతో ఫిర్యాదు కాపీ సిద్ధమైన వెంటనే, అది ఆన్లైన్ ద్వారా సంబంధిత పోలీసు అధికారులకు చేరేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. దీనివల్ల ఫిర్యాదుల నమోదులో జాప్యం తగ్గి వేగంగా స్పందించే అవకాశం అవకాశం కలుగుతుంది. దాదాపు 10 భాషల్లో తమ సమస్యలను విన్నవించుకునే వెసులుబాటు ఇందులో ఉంది. ఏఐ దానిని విశ్లేషించి స్థానిక భాషలోకి అనువదించి రికార్డు చేస్తుంది.

