కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

క‌లం, వెబ్ డెస్క్‌: ప్ర‌ముఖ కాపు ఉద్య‌మ‌ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం (Mudragada Padmanabham) నేడు క‌న్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న హైదరాబాద్ లోని సింధు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న క్యాన్స‌ర్‌తో పాటు శ్వాస సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌లతో బాధ ప‌డుతున్నారు. నేడు ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం 1953 జ‌న‌వ‌రి 22న కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో జ‌న్మించారు. తన తండ్రి మరణానంతరం 1977లో రాజకీయ రంగ ప్రవేశం చేసి, జనతా పార్టీ నుంచి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా సేవలందించారు. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు నుంచి 1978-94 వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1982లో టీడీపీలో చేరారు. త‌ర్వాత‌ 1983, 1985లో టీడీపీ నుంచి రెండు సార్లు పోటీ చేసి గెలుపొందారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ హ‌యాంలో, కాంగ్రెస్ పాలనలో చెన్నారెడ్డి హయాంలో ముద్ర‌గ‌డ మంత్రిగా కూడా సేవలు అందించారు. 1999లో కాకినాడ నుంచి టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన రాజకీయ జీవితంలో జనతా పార్టీ టీడీపీ, కాంగ్రెస్, స్వతంత్య్ర, ప్రజారాజ్యం, వైసీపీ పార్టీల్లో ముద్రగడ పని చేశారు.

2009లో ముద్రగడ ప్రజా రాజ్యం పార్టీలో చేరి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2016 తుని రైలు ఘటనతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. కాపు సామాజిక వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై త‌న గ‌ళం వినిపిస్తూ రాష్ట్రంలో ముఖ్య కాపు నేత‌ల్లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. కాపులను బీసీల్లో చేర్చాలని ఏడు సార్లు దీక్షలు చేశారు. ప‌లు రాజ‌కీయ ప‌రిణామాల అనంత‌రం ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం 2024 మార్చి 15న వైసీపీలో చేరారు. వైసీపీలో చేరిక‌తో ముద్ర‌గ‌డ కుటుంబంలో మ‌న‌స్ప‌ర్థ‌లు మొద‌ల‌య్యాయి.

స్వ‌యంగా ముద్ర‌గ‌డ కుమార్తె తండ్రిని వ్య‌తిరేకిస్తూ సోష‌ల్ మీడియాలో వీడియోలు పెట్ట‌డం ప్రారంభించింది. ముద్ర‌గ‌డ‌ (Mudragada Padmanabham) ఆ స‌మ‌యంలో ఎన్నిక‌ల్లో జనసేన గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సంచలన శపథం చేశారు. మాట ఇచ్చిన‌ట్లే ఎన్నిక‌ల త‌ర్వాత త‌న పేరు చివ‌ర‌న రెడ్డిని జోడిస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Read Also: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>