కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా సెన్సస్ (Telangana Census) సెకండ్ ఫేజ్ జనవరి 25 నుంచి మొదలుకానుంది. తొలుత రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12.00 గంటల వరకు కటాఫ్ డేట్‌గా ఉంటుంది. అప్పటివరకు ఉన్నవారి వివరాలను జనాభా లెక్కల్లో పొందుపరుస్తారు. ఫిబ్రవరి 28 అర్ధరాత్రి 12 గంటల తర్వాత పుట్టిన పిల్లలు, చనిపోయినవారు జనాభా లెక్కల్లో చేరరు.
సెన్సస్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి సేకరించే ఈ లెక్కల ప్రక్రియ లాంఛనంగా జనవరి 25న ప్రారంభం కావడానికి ముందు 15 రోజుల పాటు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పేరుతో ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నది. ఆ ప్రకారం జనవరి 10 (జనవరి 9 అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత) నుంచి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం అందుబాటులోకి తెస్తుంది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో జరిగిన ఫస్ట్ ఫేజ్‌లో (హౌజ్ లిస్టింగ్) సైతం సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం అమలైంది.
ట్రెయినింగ్ సెషన్ మొదలు
జనాభా లెక్కల సేకరణ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రాష్ట్రంలో ట్రెయినింగ్ సెషన్ మొదలైంది. మాస్టర్ ట్రెయినర్స్ మొదలు మండల స్థాయి సిబ్బంది వరకు దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ డిసెంబర్ చివరికల్లా కంప్లీట్ కానున్నది. జనాభా లెక్కల సేకరణలో ప్రజల నుంచి వివరాలను సేకరించడానికి వేయాల్సిన ప్రశ్నలు, వారి నుంచి వచ్చే సమాధానాలకు అనుగుణంగా డిజిటల్ రూపంలో నమోదు చేయాల్సిన కోడ్స్.. ఇలాంటి వాటిపై ట్రెయినింగ్ జరుగుతున్నది.
ఒకవైపు ఓబీసీకి ప్రత్యేక కాలమ్ పెట్టాలని బీసీ సంఘాల నుంచి దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతున్న సమయంలో సెకండ్ ఫేజ్ షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. మొత్తం 40 ప్రశ్నల ద్వారా ప్రజల నుంచి సెన్సస్ సిబ్బంది వివరాలను రాబట్టనున్నారు. ఒకసారి సెన్సస్‌కు వచ్చి వెళ్లిన తర్వాత చోటుచేసుకున్న జనన, మరణాలను నమోదు చేసేందుకు సెన్సస్ సిబ్బంది మరోసారి మార్చి 1 నుంచి 5 వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలను మొబైల్ యాప్‌లో అప్డేట్ చేసుకోనున్నారు.

