ఏపీ మున్సిపల్ సమరం.. ఆ కేంద్రాలపై ప్రత్యేక నిఘా!

కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. నేడు పోలింగ్ సామగ్రితో పాటు బ్యాలెట్ బాక్సులను తరలించే ప్రక్రియ కొనసాగుతుండగా, సిబ్బంది ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 36,351 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాల పోలీసులతో పాటు ఏపీఎస్పీ, ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దించారు. మొత్తం 4,372 పోలింగ్ స్టేషన్ లొకేషన్ల పరిధిలో గట్టి నిఘా ఉంచారు. వీటిలో 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, కేవలం అక్కడే 3,355 మంది పోలీసులను మోహరించారు.

అలాగే 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో 4,943 మంది పోలీసులతో భద్రత కల్పించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. 1,543 రూట్ మొబైల్ బృందాలు, 481 స్ట్రైకింగ్ ఫోర్స్, 347 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు ముమ్మరం చేశారు. బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే 111 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 4,655 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

నిబంధనల ఉల్లంఘనలపై కేసులు..

అక్టోబర్ 15 నుంచి 29 వరకు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 261 కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో 107 మందిని అరెస్ట్ చేయగా, 733 మందికి నోటీసులు జారీ చేశారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిళ్లకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేసింది. అవసరమైన చోట నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>