కలం, వెబ్ డెస్క్: బెంగళూరు తాగు నీటి సమస్య తీరాలంటే మేకధాతు ప్రాజెక్ట్ ఒక్కటే మార్గమని, అది కట్టి తీరుతామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు. సుప్రీంకోర్ట్ ఇప్పటికే దీనిపై తుది తీర్పు వెలువరించిందని, కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని అనుమతులు జారీ చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకే వెళ్లాలని నిర్ణయించామన్నారు. కావేరి జల వివాదంపై అన్ని రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.
రైతుల ప్రయోజనాలే ముఖ్యం..
కావేరి జల వివాదం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కొత్తేం కాదని సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏ రాష్ట్రం ఎక్కువ, తక్కువ కాదన్నారు. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. తన వినతిని పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటన వాయిదా వేసుకున్నారని వివరించారు. కావేరి జల వివాదాన్ని అందరితో చర్చించి పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తమ మంత్రులు ప్రతి జిల్లాకు వెళ్లి కావేరి సమస్యపై రైతులకు వాస్తవాలను చెబుతారని పేర్కొన్నారు. అంతేగాకుండా, ప్రతి జిల్లాలో ప్రస్తుత వ్యవసాయ రంగ పరిస్థితులపై నివేదిక రూపొందించబోతున్నట్లు తెలిపారు.

