కలం, నల్లగొండ : భూమి హక్కుల పరిరక్షణ, రెవెన్యూ రికార్డుల పారదర్శకత, చట్టబద్ధమైన పరిష్కార మార్గాలపై భవిష్యత్తు న్యాయవాదులకు తెలంగాణ భూభారతి (భూ హక్కుల రికార్డుల) చట్టంపై (Bhu Bharati Act) అవగాహన కల్పించే లక్ష్యంతో నల్లగొండలోని పానగల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా (మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం) ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకుల రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కమిషన్ సభ్యుడు ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎం. సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ భూభారతి (భూ హక్కుల రికార్డుల) చట్టం, 2025లోని కీలక సెక్షన్లు, వాటి ఉద్దేశాలు, ఆచరణాత్మక ప్రాముఖ్యతను విద్యార్థులకు విశదీకరించారు. భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని, అది రైతుల జీవనోపాధి, కుటుంబాల ఆర్థిక భద్రతతో ముడిపడిన సున్నితమైన అంశమని ఆయన పేర్కొన్నారు. యాజమాన్య హక్కుల నమోదు, వారసత్వ సంక్రమణ, భూ బదలాయింపు, రికార్డుల్లో తప్పుల సవరణ, అప్పీల్ విధానాల వంటి అంశాలను చట్టపరమైన కోణంలో విశ్లేషించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. చట్టంలోని ప్రతి సెక్షన్ వెనుక ఉన్న ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా భూ వివాదాలపై తుది అభిప్రాయానికి రావడం సముచితం కాదని న్యాయ విద్యార్థులకు సూచించారు.
ఆధునిక కాలంలో భూ పరిపాలనలో డిజిటల్ సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఆన్లైన్ సేవలు, డిజిటల్ రికార్డుల నిర్వహణపై విద్యార్థులు పట్టు సాధించాలని సునీల్ కుమార్ ఆకాంక్షించారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ పౌరుల హక్కుల రక్షణ, సమాచార విశ్వసనీయత, అధికారుల జవాబుదారీతనం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆకుల రవి మాట్లాడుతూ, న్యాయ విద్యార్థులు కేవలం తరగతి గదిలోని పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా, సమాజంలో అమలవుతున్న చట్టాలు, పరిపాలనా వ్యవస్థలపై ఆచరణాత్మక అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొనే భూ సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారాలు చూపగలిగేలా పరిశోధనాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కే. సంజీవరెడ్డి, బి. సునీత, ఆర్. ధనలక్ష్మి, పి. నాగేంద్ర గౌడ్, డి. హేమంత్, ప్రశాంత్, కళాశాల సిబ్బంది, పెద్ద సంఖ్యలో న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

