కలం, ఖమ్మం బ్యూరో: బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, లైంగిక వేధింపులు, బాలల అక్రమ రవాణా వంటి సామాజిక దురాచారాలను ఉక్కుపాదంతో అణచివేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కేఎం తార పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం (International Childrens Day) సందర్భంగా శుక్రవారం స్థానిక చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాల (Chunchupalli Govt School) లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలలపై ఎక్కడైనా హింస, నిర్లక్ష్యం లేదా హక్కుల ఉల్లంఘన జరిగినట్లు గుర్తిస్తే సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అటువంటి ఘటనలను తక్షణమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, బాధిత పిల్లలకు తగిన రక్షణ, న్యాయం అందేలా చూడాలని కోరారు. బాలల హక్కుల పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పౌర సమాజం భాగస్వాములై వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
బాలలే దేశ భవిష్యత్తుకు నిజమైన సంపదని పేర్కొన్న ఆమె, ప్రతి బాలబాలికకు ప్రేమ, ఆప్యాయత, భద్రతతో కూడిన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. పేదరికం, సామాజిక అసమానతలు, ఇతర కారణాల వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదని స్పష్టం చేశారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం, పరిశుభ్రత, వైద్య సేవలు, మానసిక ఆరోగ్య పరిరక్షణ ఎంతో కీలకమని వివరించారు. అలాగే పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ, వారిలోని అంతర్గత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి హరి కుమారి, మహిళా సాధికారత సిబ్బంది సౌజన్య, షీటీం ఎస్ఐ రమాదేవి, డీసీపీయూ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

