కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండలం మహాత్మా నగర్ పరిధిలోని స్వయంభు శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి 22వ అధ్యయన బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ తిరునగరి విష్ణువర్ధన స్వామి, వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి నేతృత్వంలో స్వయంభు శ్రీ తాపాల లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది.
ఈ దివ్య కల్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి, కరీంనగర్ జిల్లా నలుమూల నుండి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు, సామూహిక అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని విద్యుత్ కాంతులతో, పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ భారీ ఏర్పాట్లు చేశారు.

