కలం, వెబ్ డెస్క్: తమిళనాడు కొత్త సీఎంగా విజయ్ (CM Vijay) మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దళపతి పూర్వీకులు తెలుగు వారేనని చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని అతడి తండ్రి, దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అప్పట్లో ఏపీలోని చాలా ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉండేవి. విజయ్ తాత చిత్తూరుకి చెందినవారు. ఇక్కడి నుంచి ఆయన మొదట కన్యాకుమారికి వలస వెళ్లారు. అనంతరం, అక్కడే చిన్నాచితకా పనులు చేస్తూ సెటిల్ అయ్యారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ అక్కడే జన్మించి.. సినిమాలపై ఆసక్తితో చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. తొలుత స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్ ప్రారంభించి.. డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగి.. మంచి పేరు సంపాదించుకున్నారు.
‘తెలుగు కొంచెం మాట్లాడుతా..’
విజయ్ తన మూవీస్ విడుదలైనప్పుడల్లా హైదరాబాద్ వచ్చి అనేక సార్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు. ‘మా ఇంట్లో అమ్మనాన్న అప్పుడప్పుడు తెలుగులోనే మాట్లాడుకుంటారని..అలా నాకు కొంచెం తెలుగు మాట్లాడటం వచ్చు. పూర్తిగా మాత్రం రాదు. ఇక్కడున్న నా ఫ్యాన్స్ కోసమైనా తెలుగు నేర్చుకుంటా’ అని విజయ్ పలు ఇంటర్వ్యూల్లో సరదాగా చెప్పుకొచ్చారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలుగు మీడియాతో అచ్చ తెలుగులోనే మాట్లాడుతుంటాడు.

