కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ చరిత్ర, కేసీఆర్ పర్సనాలిటీ, తెలంగాణపై కేసీఆర్ కు ఉన్న నాలెడ్జ్ ఈ భూభాగంలో ఎవరికైనా ఉందా? అని బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ప్రశ్నించారు. పెద్దపులి (కేసీఆర్) వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుందని.. అప్పుడప్పుడు వచ్చిపోతే అందరికీ భయమవుతుందని కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లోని అంబర్ పేటలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తలసాని భరోసా ఇచ్చారు. ఇవాళ పొట్టోడు, పొడుగోడు అందరూ మాట్లాడుతున్నారని సెటైరికల్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు తల ఎత్తుకుని జీవించవచ్చని.. దీనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ మనకు కన్నతల్లి లాంటిదని.. పార్టీ లేకపోతే ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. పార్టీనే సుప్రీం అని.. పార్టీ జెండా కిందనే మనమందరం ఉంటామని అన్నారు. బస్తీలోకి వెళ్లి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తుపడతారు.. తప్ప పార్టీ నుండి తీసేసిన తరవాత తమ దగ్గరకు ఎవరూ రారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ఇది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పదేళ్లలో తెలంగాణను అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టిందన్నారు.

