పాత ఓటరు జాబితా రద్దు.. మళ్లీ నమోదు తప్పనిసరి: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కలం, సూర్యాపేట: శాసనమండలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (MLA Guntakandla Jagadish Reddy) పిలుపునిచ్చారు.

సూర్యాపేట (​Suryapet) జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవన్ సెంటర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటరు నమోదు (Graduate Voter Registration) కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నోటిఫికేషన్ వెలువడిన తొలిరోజే ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తన సతీమణితో కలిసి హెల్ప్ డెస్క్‌లో ఓటు హక్కును నమోదు చేసుకున్నారు.

గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితా పూర్తిగా రద్దయిందని, పాత, కొత్త పట్టభద్రులందరూ తప్పనిసరిగా మళ్లీ తమ ఓటును నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో, అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ఏ రకమైన పోరాటపటిమ ప్రదర్శిస్తుందో పట్టభద్రులు లోతుగా ఆలోచించాలి” అని కోరారు.

రాష్ట్రంలో జరుగుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ప్రతీ ఓటరు చైతన్యవంతంగా వ్యవహరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం సూర్యాపేట వాణిజ్య భవన్ సెంటర్‌లో బీఆర్ఎస్ తరఫున అన్ని సౌకర్యాలతో ప్రత్యేక హెల్ప్ డెస్క్ సిద్ధం చేశామని తెలిపారు.

విశ్రాంత ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు ఇలా డిగ్రీ పూర్తయిన ప్రతి పట్టభద్రుడూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఓటరుగా నమోదు కావాలని జగదీష్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>