కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: వ్యవసాయ, ఉద్యాన సాగు ఉత్పత్తుల ద్వారా రైతులకు (Farmers) అధిక ఆదాయం వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల కార్యదర్శి సురేంద్ర మోహన్ (Surendra Mohan) అన్నారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్ (Mahabubnagar )జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, మార్కెటింగ్, సహకార శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎల్ నినో పంటల ఉత్పత్తి పై ప్రభావం, ఖరీఫ్‌లో వరి ధాన్యం కొనుగోళ్లు, రాబోయే రబీ ప్రణాళిక, పత్తి, జొన్న ఇతర పంటల సాగు , ఎంఎస్పీ, ఫార్మర్ ఐడీ, ఆయిల్ ఫామ్, మల్బరీ సాగు తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 31 శాతం వర్షపాతం లోటు ఉందని, జిల్లాలో 11 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదు జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఖరీఫ్‌లో ఒక లక్షా 45 వేల ఎకరాల వరకు వరి సాగు జరిగిందని, గత ఖరీఫ్‌లో 2 లక్షల 32 వేల ఎకరాల్లో వరి సాగు తగ్గిందని వివరించారు. ఎల్ నినో వర్షపాతం లోటు కారణంగా ఆరు తడి పంటలు, ఉద్యాన పంటలు సాగుకు రైతులను ప్రోత్సహించినట్లు వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్ వివరించారు. సన్న రకంలో 7 రకాలకు బోనస్ ప్రకటించినందున వాటిని గుర్తించేందుకు వ్యవసాయ డిప్లొమా, బీఎస్సీ అగ్రికల్చర్ వారిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున అవసరమైన చోట నియామకం చేసుకోవాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సూచించారు. జిల్లాలో పత్తి తేలిక నేల స్వభావం కారణంగా కొంత పంట దెబ్బతిందని అన్నారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా నిర్వహించాలన్నారు.
పత్తి, జొన్నలు మార్కెట్‌లో ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటు లభిస్తుందని అధికారులు వివరించారు. రబీ సాగు ప్రణాళికపై సమీక్షించి రైతులకు అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలో ఉద్యాన పంటల సాగు 656 ఎకరాల నుండి 3160 ఎకరాల వరకు పెరిగిందని, రైతులు వరి, పత్తి సాగు నుండి ఉద్యాన పంటలు చేపట్టి అధిక ఆదాయం పొందుతున్నట్లు ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ వివరించారు. అందు వల్ల రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర, బోనస్‌లకు మించి బయట ఎక్కువ ధర వచ్చేలా ఉంటే ప్రత్యేకించి రైతు ఉత్పాదక సంస్థల ద్వారా వారికి మరింత ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. అలాగే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, భవిష్యత్తులో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్తారని చెప్పారు. అలాగే కూరగాయల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం వచ్చేలా అన్ని శాఖల అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, భవిష్యత్తులో రైతును కాపాడుకుంటేనే అందరికీ మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా వ్యవసాయ, ఉద్యాన, సహకార, తదితర శాఖల సమీక్ష సందర్భంగా వివరాలను తెలియజేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, డి ఆర్.ఓ.ఏ. నిర్మల, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా సహకార అధికారి కృష్ణ,జిల్లా ఉద్యాన అధికారి వేణుగోపాల్, జిల్లా మార్కెటింగ్ అధికారిని బాల మణి ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.

