చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ మహా పాదయాత్ర: బండి సంజ‌య్‌

క‌లం, క‌రీంన‌గ‌ర్: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఈనెల 23న కరీంనగర్ కు రానున్న నేపథ్యంలో పర్యటన విజయవంతంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) దృష్టి సారించారు. ‘‘సర్’’ పై కాంగ్రెస్, ఇండియా కూటమి నేతల తీరుకు వ్య‌తిరేకంగా ఈ పర్యటన కొనసాగనుంది. అందులో భాగంగా నితిన్ నబీన్ ‘‘మహా పాదయాత్ర’’ చేయనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నితిన్ నబీన్ మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నేత‌లు నిర్ణయించారు. అందులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించి నితిన్ నబీన్ తోపాటు ‘‘మహా పాదయాత్ర’’ నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. కరీంనగర్ గాంధీ విగ్రహం నుండి వైశ్యా భవన్, టవర్ సర్కిల్, గంజ్, గడియారం సర్కిల్, శాస్త్రీరోడ్, భారత్ టాకీస్ మీదుగా కమాన్ చౌరస్తా వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లకుపైగా ‘మహా పాదయాత్ర’ జరిగేలా రూట్ మ్యాప్ రూపొందించారు.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర సహ సంఘటనా కార్యదర్శి దశరథ్, బీజేపీ జిల్లా ఇంఛార్జీ బండారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్లతో కలిసి వైశ్యా భవన్ వద్దకు వెళ్లారు. మహా పాదయాత్ర రూట్ ను పరిశీలించారు. వైశ్యా భవన్ వద్ద నితిన్ నబీన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడ స్టేజీ, ఇతర ఏర్పాట్లపై నేతలతో చర్చించారు. అనంతరం కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కనీవినీ ఎరగని రీతిలో మహా పాదయాత్రకు ప్రజలు రానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని పోలీసులను కోరారు. మహా పాదయాత్ర కు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు రవాణా ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు దాదాపు వెయ్యి బస్సులు, 2 వేల ఆటోలతోపాటు వందలాది మినీ బస్సులను కూడా సమకూరుస్తున్నట్లు తెలిపారు. దీంతోపాటు వేలాది కార్లలోనూ నాయకులు కరీంనగర్ పాదయాత్రకు వస్తున్నట్లు చెప్పారు. జిల్లాలు, మండలాలు, నియోజకవర్గాల నుండి వచ్చే బస్సులు, ఆటోలు, వాహనాల, కార్ల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసులను సూచించారు. దీంతోపాటు నితిన్ నబీన్ పాదయాత్ర సందర్భంగా తొక్కిసలాట లేకుండా జనం మధ్యలోనుండి పాదయాత్ర చేసుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కోరారు.

అనంతరం జన సమీకరణ, మహా పాదయాత్ర ఏర్పాట్లు, అలంకరణ, హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాట్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజంతా పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. తొలుత ఎంపీ కార్యాలయంలో సిరిసిల్ల జిల్లా నేతలతో సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా నాయకులతోనూ మాట్లాడారు.

అనంతరం నగరంలోని కొండా సత్యలక్ష్మీ గార్డెన్ లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మండలాధ్యక్షులు, మండల ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర సహ సంఘటన ఇంఛార్జీ దశరథ్, కరీంనగర్ జిల్లా ఇంఛార్జీ బండారి శాంతికుమార్, బీజేపీ ఎస్పీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, సంజీవరెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ సీనియర్ నేతలు బొమ్మ జయశ్రీ, ఓదెలు, గంగాడి క్రిష్ణారెడ్డి, బాస సత్యనారాయణ, మోహన్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర సహ సంఘటన కార్యదర్శి దశరథ్ జీ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో అమిత్ షా పర్యటన విజయవంతం కావడంతోనే కాంగ్రెస్ పార్టీకి శవ పేటిక రడీ చేసినట్లయిందని అన్నారు. ఈనెల 23న కరీంనగర్ లో నితిన్ నబీన్ పర్యటనను విజయవంతమయ్యాక కాంగ్రెస్ పార్టీని సమాధి చేసేందుకు సిద్ధమైనట్లేనని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని, అందులో భాగంగా నిర్వహించే కరీంనగర్ నితిన్ నబిన్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని తెలిపారు. అంచనాలకు మించి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నితిన్ నబీన్ పర్యటనను కనీవినీ ఎరగని రీతిలో చరిత్ర స్రుష్టించడంతోపాటు దేశమంతా చర్చ జరిగేలా విజయవంతం చేయాలని పార్టీ నేతలను కోరారు. మహాపాదయాత్ర ఆద్యంతం సర్ కు మద్దతుగా నిలవడంతోపాటు వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో కరీంనగర్ దద్దరిల్లాలని కోరారు. ఫ్లెక్సీలు, హోర్డింగులు, కాషాయ జెండాలతో నితిన్ నబీన్ కు ఘన స్వాగతం పలకడంతోపాటు కరీంనగర్ ను కాషాయ మయం చేయాలని కోరారు.

బీజేపీ అధికారంలోకి వస్తే..

బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు పూర్తి స్థాయిలో అద్బుతమైన రీతిలో శాశ్వతమైన భవనాలను నిర్మిస్తామని బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా గుడి, బడి ఆసుపత్రులను నిర్మించడంతోపాటు కార్పొరేట్ స్థాయిలో అర్హులైన పేద, మధ్య తరగతి ప్రజలందరికీ విద్య, వైద్య సేవలను అందిస్తామని చెప్పారు. ఈరోజు కరీంనగర్ లోని పద్మశాలి సంఘం భవనం పై అంతస్తు భాగంలో నూతనంగా నిర్మించిన గదులను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పద్మశాలీ కుల సంఘం నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘అధికారంలో లేకపోయినా ఎంపీ లాడ్స్ నిధులతో పద్మశాలి సంఘం భవనానికి సాయం చేసిన. దీంతోపాటు అన్ని కుల సంఘాలకు సాయం చేసిన. వీలైనంత కమ్యూనిటీ హాళ్ల నిర్మాణంతోపాటు గుడి, బడి, ఆసుపత్రి సేవలకే నేను అత్యధిక ప్రాధాన్యతినిస్తున్నా. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కుల సంఘాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్య, వైద్య సేవలు అందిస్తానని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పాలనలో తెలంగాణ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలి మాటలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. సర్ పైనా లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయన్నారు. ‘‘చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించాలా? వద్దా? విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను తొలగించాలా? వద్దా? రెండు, మూడేసి ఓట్లున్న వారిని ఓటర్ల జాబితా నుండి తొలగించాలా? వద్దా? 18 ఏళ్లు నిండిన భారతీయులందరికీ ఓటు హక్కు కల్పించాలా? వద్దా? సర్ పేరుతో ఓటర్ జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్ కు వచ్చిన ఇబ్బంది ఏమిటి?’’అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ‘సర్’ పై వాస్తవాలను వివరించేందుకు ఈనెల 23న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ కరీంనగర్ విచ్చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ మహా పాదయాత్రకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>