కలం, వెబ్ డెస్క్: కుక్క కాట్ల భయం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా గౌరవప్రదమైన జీవన హక్కులో భాగమేనని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై గతంలో ఇచ్చిన ఆదేశాలు యధాతథంగా అమలవుతాయని, సడలింపు చేసే అవకాశం లేదని పేర్కొన్నది. పబ్లిక్ ప్లేస్2లలో తిరిగే కుక్కల నియంత్రణపై గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చేందుకు, వెనక్కి తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పబ్లిక్ ప్లేస్‌లలోకి వచ్చే చిన్నారులు, వృద్ధులు, ప్రజల ప్రాణ భద్రత, రక్షణకే ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.
గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాధ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించి ఆ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో ఇకపై ఆసుపత్రులు, పాఠశాలలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా మైదానాలు వంటి ప్రజా ప్రదేశాల్లో పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చేసిన తర్వాత తిరిగి అదే ప్రాంతంలో విడిచిపెట్టడానికి వీల్లేదు.
వాటిని తప్పనిసరిగా ప్రత్యేక షెల్టర్లలోనే ఉంచాలని కోర్టు తాజా ఉత్తర్వులతో మరింత క్లారిటీ ఇచ్చింది. చిన్నారులపై కుక్కలు దాడులు చేసినప్పుడు పలు సందర్భాల్లో ప్రాణాలు పోతున్నాయని, వృద్ధులపై కుక్కలు దాడులు చేసినప్పుడు నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వస్తున్నదని, విదేశీ పర్యాటకులు సైతం ఈ దాడులకు గురవుతున్నారని, విమానాశ్రయాలు, కాలనీలు వంటి కీలక ప్రదేశాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉన్నదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు (Supreme Court) బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఘటనలు ఆందోళనకరమని వ్యాఖ్యానించింది.
ప్రజల ప్రాణాలను రక్షించడం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత అని, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు వాటి విధుల్లో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే కుక్క కాటు ఘటనలు జరగడం వ్యవస్థల వైఫల్యమేనని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నిశ్శబ్ద ప్రేక్షకుడిలా ఉండకూడదన్నది. విధులు నిర్వర్తించని అధికారులపై చర్యలు తీసుకోవాలని, కోర్టు ధిక్కరణ కేసులు పెట్టాల్సి వస్తుందని, శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలూ తప్పవని హెచ్చరించింది.
Read Also: హైదరాబాద్ ‘లులు మాల్’లో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
Follow Us On: WhatsApp

