దేశ ప్రజల విశ్వసనీయ ప్రతినిధి ఎల్ఐసీ: SU రిజిస్ట్రార్

కలం, కరీంనగర్ బ్యూరో:  70 వసంతాలు పూర్తి చేసుకున్న ఇన్సూరెన్స్ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC)లో బీమా వారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక డివిజనల్ కార్యాలయంలో సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగ ప్రసాద్ ఎల్ఐసీ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. దేశ సేవకు సంస్థ ద్వారా పునరంకితమవుతామని ఈ సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు.

గొప్ప ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఎల్ఐసీ..

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన యూనివర్సిటీ (SU) రిజిస్ట్రార్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. భారత దేశ ప్రజల అత్యంత విశ్వసనీయ ప్రతినిధి ఎల్ఐసి మాత్రమేనని అన్నారు. 26 సంవత్సరాలుగా 25 సంస్థలతో పోటీ ఉన్న వాతావరణంలో కూడా ప్రజల నమ్మకాన్ని చూరగొంటూ అద్భుతమైన సేవలను అందిస్తున్న సంస్థ ఎల్ఐసీ అని కొనియాడారు. తమ తండ్రికి తమకు, తమ పిల్లలకు కూడా ఎల్ఐసీ పాలసీలు ఉన్నాయని.. ఈ సంస్థను పూర్తిగా నమ్ముతామని తెలియజేశారు. ఒకప్పుడు ఇన్సూరెన్స్ అంటే కేవలం అనుకోని మరణం సంభవిస్తే వచ్చే డబ్బులు మాత్రమే అనే భావన ఉండేదని, అయితే కాలంతోపాటు ప్రజల మారుతున్న అవసరాలకు అనుగుణంగా అనేక పొదుపు పాలసీలను, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలను అందిస్తూ తన గొప్ప ప్రయాణాన్ని కొనసాగిస్తున్నదని కొనియాడారు.

ప్రతి ఒక్కరికి అభినందనలు..

ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న భారతదేశంలో ఎల్ఐసీ లాంటి సంస్థలు యువజన శక్తిని నిర్మాణాత్మకమైన దిశలో ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సోమశేఖర్, ఎస్టేట్స్ మేనేజర్ రఘు, సీఆర్ఎం మేనేజర్ వేణుగోపాల్, క్లాస్ 1 అధికారుల సంఘం నాయకులు విజయకుమార్, క్లాస్ టు డెవలప్ మెంట్ ఆఫీసర్ సంఘం నాయకులు వాసుదేవరెడ్డి,  ఐసీఈయూ నాయకులు వామన్ రావు, బీఎంఎస్ నాయకులు రవీంద్ర చారి, ఎస్సీ-ఎస్టీ సంఘం నాయకులు మాధవి, వాలిక్ సంఘం నాయకులు బుచ్చయ్య, ఓబీసీ సంఘం నాయకులు సత్తయ్య, ఏజెంట్ల సంఘం నాయకులు వేణుగోపాల్ తోపాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు పెన్షనర్లు పాల్గొన్నారు.

ఇందిరా దేవికి సన్మానం..

పెనుగొండ బసవేశ్వర్ సమన్వయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 సంవత్సరాలు పైబడిన 8 మంది పెన్షనర్లను, సీనియర్ మోస్ట్ ఉద్యోగి ఇందిరా దేవిని ప్రత్యేకంగా సన్మానించారు. ప్లాంట్ ఏ లైఫ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఉద్యోగికి ఒక మొక్కను అందజేశారు. అలాగే వారం రోజులపాటు ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా మొబైల్ పబ్లిసిటీ వ్యాన్లను ఎస్ డి ఎం జండా ఊపి ప్రారంభించారు. వారం రోజులపాటు జరిగే ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం అంబేద్కర్ స్టేడియంలో మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>