మర్రిగూడలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు

కలం, మునుగోడు: బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి (Varshit Reddy) నివాసంతో పాటు హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేశారనే ఆరోపణలు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ దాడులకు నిరసనగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మర్రిగూడ (Marriguda) మండలంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు నిలిచిపోయిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరసనలపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న మర్రిగూడ పోలీసులు మంగళవారం ఉదయమే రంగంలోకి దిగి నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీ మండల ముఖ్య నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల రాములు గౌడ్‌తో పాటు ముఖ్య నాయకులు వెనేపల్లి శ్రీనివాసరావు, అంబల్ల రమేష్‌ గౌడ్‌, పగడాల నాగేష్‌, జింకల లింగస్వామి, మామిడి కమలాకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు: రాములు గౌడ్‌

ముందస్తు అరెస్టులపై బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పందుల రాములు గౌడ్‌, ఇతర నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలలో జాప్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటని, ముందస్తు అరెస్టులతో తమ ఆందోళనలను అడ్డుకోలేరని రాములు గౌడ్‌ స్పష్టం చేశారు. వర్షిత్‌రెడ్డి నివాసంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ముందస్తు అరెస్టుల నేపథ్యంలో మర్రిగూడ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>