కలం, స్పోర్ట్స్: 17 ఏళ్లకే ప్రపంచ టెన్నిస్‌లో అతి పెద్ద వేదికపై అడుగుపెట్టబోతోంది థియా ఫ్రోడిన్ (Thea Frodin). యూఎస్ ఓపెన్‌లో ఆమె తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ నెంబర్-2 ఎలెనా రైబాకినాను ఎదుర్కోనుంది. ఫ్రోడిన్కు కెమెరాల ముందు నిలబడటం కొత్త కాదు. టెన్నిస్ కోర్టులోకి రాకముందే ఆమె హాలీవుడ్లో కనిపించింది. 2021లో వచ్చిన ‘కింగ్ రిచర్డ్’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. సినిమాలో చిన్ననాటి సెరెనా విలియమ్స్ పాత్రను పోషించిన డెమీ సింగిల్టన్కు ఫ్రోడిన్ టెన్నిస్ బాడీ డబుల్‌గా పనిచేసింది.
యూఎస్ ఓపెన్‌లో వైల్డ్ కార్డ్..
ఆరు నెలలు సినిమా షూటింగ్లో పాల్గొంది. విల్ స్మిత్‌తో పాటు పలువురు ప్రముఖ నటులతో కలిసి పనిచేసింది. అయితే ఆ అనుభవం ఆమె టెన్నిస్‌పై కూడా ప్రభావం చూపింది. సెరెనా ఆటను అనుకరిస్తూ ఎక్కువ కాలం గడపడంతో.. తన సహజ ఆటను మళ్లీ అలవాటు చేసుకోవడానికి ఫ్రోడిన్కు కొంత సమయం పట్టింది. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక టెన్నిస్ కథను రాయడానికి సిద్ధమైంది. యూఎస్‌టీఏ బిల్లీ జీన్ కింగ్ గర్ల్స్ 18 నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడంతో ఫ్రోడిన్కు యూఎస్ ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ లభించింది.
టెన్నిస్ తొలి ప్రాధాన్యం..
టెన్నిస్‌నే తన తొలి ప్రాధాన్యంగా చూస్తున్న ఫ్రోడిన్.. భవిష్యత్తులో నటనను కూడా కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. రెండు రంగాలను సమతూకంగా కొనసాగించడం తనకు ఆసక్తికరంగా ఉంటుందని పేర్కొంది. ఇప్పుడు ఆమె ముందున్న అతిపెద్ద సవాల్ రైబాకినా. 17 ఏళ్ల ఫ్రోడిన్ తన యూఎస్ ఓపెన్ అరంగేట్రాన్ని ఎలా మార్చుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

