Mobile Popup Ad
Mobile Popup Ad

న‌ల్గొండ‌లో పాఠ‌శాల మొద‌టి రోజే విషాద‌క‌ర ఘ‌ట‌న‌!

కలం, కొండమల్లేపల్లి: నల్గొండ (Nalgonda) జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో సోమవారం పాఠశాలల పునః ప్రారంభం మొదటి రోజే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురైన సంఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాల మొదటి రోజు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు స్కూల్ మెయిన్ గేట్ వద్ద మామిడి తోరణాలు కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తోరణాలు కట్టడంలో సహాయం చేయడం కోసం, పక్కనే ఆడుకుంటున్న ఎనిమిదో తరగతి విద్యార్థి రామ్ చరణ్ (13)ను ఉపాధ్యాయులు పిలిచారు. సహాయం చేయడానికి సదరు విద్యార్థి పాఠశాల ఇనుప గేటు ఎక్కి మామిడి ఆకులు కడుతుండగా, ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న విద్యుత్ తీగలను పట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భారీ విద్యుదాఘాతానికి గురై, బాలుడు అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి పడిపోయాడు.

గమనించిన ఉపాధ్యాయులు, సిబ్బంది హుటాహుటిన బాలుడిని చికిత్స నిమిత్తం దేవరకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ బాలుడికి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన విద్యార్థిని నాంపల్లి మండలం, తిమ్మాపురం గ్రామానికి చెందిన జ్యోతి, శంకర్ ల కుమారుడు రామ్ చరణ్ (13)గా గుర్తించారు. ఈ బాలుడు కొండ మల్లేపల్లి జెడ్పీహెచ్ఎస్ లోనే 8వ తరగతి చదువుతున్నాడు. బడి మొదటి రోజే కుమారుడు ఇలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం, తోరణాలు కట్టేందుకు చిన్న పిల్లవాడిని గేటు ఎక్కించడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>