కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టరేట్ కార్యాలయం శునకాలకు ప్రధాన ఆవాసంగా మారిపోయింది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన “గ్రీవెన్స్ డే” (ప్రజావాణి) కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదుదారులు రాగా, అక్కడ దృశ్యాలు చూసి కంగు తిన్నారు. సాక్షాత్తూ జిల్లా పాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లోనే వీధి కుక్కలు యథేచ్ఛగా తిరుగుతూ, హాయిగా కునుకు తీస్తూ సేద తీరుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. జిల్లాలో కుక్కల దాడులతో ఇప్పటికే అల్లాడిపోతున్న తరుణంలో, కలెక్టరేట్‌లోనే శునకాలు తిష్ట వేయడం చూసి ఫిర్యాదుదారులు ఔరా అంటూ ముక్కున వేలేసుకున్నారు. భయపడుతూనే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా వీధి కుక్కల దాడులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. వీధి కుక్కల దాడులను అరికట్టి, తమను రక్షించాలని జిల్లా ప్రజలు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఏకంగా కలెక్టర్ కార్యాలయమే కుక్కలకు నిలయంగా మారడంతో షాకవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేక కలెక్టరేట్‌లోనే వీటికి శాశ్వత నివాసం కల్పిస్తూ కాలయాపన చేస్తారా? అని అక్కడకు వచ్చినవారు ప్రశ్నిస్తున్నారు.

