కలం, వెబ్ డెస్క్: దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రం ఫ్రాంచైజీగా రానున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. బాహుబలి తరహాలో ఫ్రాంచైజీగా కాకుండా ఒకే సినిమాగా (ఒక్క భాగం) రానుందని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ మాస్టర్‌క్లాస్‌లో పాల్గొన్న ఆయన, ఈ చిత్రంపై వస్తున్న రూమర్స్‌కు తెరదించారు. ఇది కేవలం ఒక్క భాగం మాత్రమేనని తేల్చి చెప్పారు. రామాయణ ఇతిహాసాలు, ప్రకృతి వైపరీత్యాలు, టైమ్ ట్రావెల్ లాంటి ఫాంటసీ అంశాల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుందన్నారు. దీని ప్రధాన బలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య ఉండే భావోద్వేగపూరిత బంధమేనని రాజమౌళి వెల్లడించారు.
‘ఆర్ఆర్ఆర్’ విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ భారీ అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రామాయణ స్ఫూర్తితో రాముడు, కుంభకర్ణుడి మధ్య వచ్చే 30 నిమిషాల యుద్ధ సన్నివేశం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుందని తెలిపారు. ఇందులో మహేశ్ రాముడిగా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభకర్ణుడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్, పురాణాల కలయికతో గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ‘వారణాసి’ (Varanasi) చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.

