కలం, మహబూబ్ నగర్ బ్యూరో: శ్రీశైలం ప్రాజెక్టు (Srisailam Project)కు ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ ఘనత సాధించిన భారతదేశపు మొట్టమొదటి నీటిపారుదల ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. ఈ అంతర్జాతీయ గుర్తింపునకు అనేక కారణాలు ఉన్నాయని నిపుణుల బృందం గుర్తించింది. దక్షిణాసియాలోనే కాకుండా ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు లేని విధంగా శ్రీశైలం డ్యామ్‌కు 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన భారీ క్రస్ట్ గేట్లు ఉండటాన్ని ప్రధానంగా పరిగణించింది. వరద తట్టుకునే పటిష్టమైన నిర్మాణం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా తెలిపారు. 2009లో వచ్చిన సుమారు 25.4 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడటం ఈ డ్యామ్ నిర్మాణ పటిష్టతకు నిదర్శనంగా నిలిచింది.
ప్రాజెక్టును పరిశీలించి..
సముద్ర మట్టానికి దాదాపు 980 అడుగుల ఎత్తులో నిర్మించిన శ్రీశైలం డ్యామ్ ఇంజనీరింగ్ నైపుణ్యం, భారీ ఎత్తున జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యాలయానికి అప్లికేషన్ పంపించింది. ఆ సంస్థ దక్షిణాసియా కార్యదర్శి ఇలియాజర్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేర్చేందుకు అన్ని అర్హతలున్నట్లు గుర్తించారు. ఈ మేరకు సోమవారం ఇరిగేషన్ సీఈ కబీర్ భాష, శ్రీశైలం డ్యాం ఎస్ఈ వేణుగోపాల్ , శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి సర్టిఫికెట్ అందజేశారు.

