పరిశ్రమల స్థాపనతో ఆర్థిక అభివృద్ధి : రాజగోపాల్ రెడ్డి

కలం, మునుగోడు: గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనతో ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజ అభ్యున్నతికి పారిశ్రామికవేత్తలు తమ వంతు కృషి చేయాలని సూచించారు.   సోమవారం చండూరు మండల పరిధిలోని తాస్కానిగూడెంలో ఏర్పాటు చేసిన వరలక్ష్మి కాటన్ మిల్లును ఆయన ప్రారంభించి మాట్లాడారు.

పరిశ్రమలు కేవలం వ్యాపారాభివృద్ధికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడేలా పనిచేయాలని ఎమ్మెల్యే (Raj Gopal Reddy) సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు తమ ప్రాంతంలోనే ఉపాధి లభించేలా పరిశ్రమల యాజమాన్యాలు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

వ్యవసాయం, పరిశ్రమలు పరస్పరం అనుసంధానమై అభివృద్ధి చెందాలని, రైతులకు మేలు జరిగే విధంగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్థానికంగా లభించే వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, పరిశ్రమల అభివృద్ధితో పాటు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించడం ముఖ్యమని పేర్కొన్నారు.

ప్రాంత అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల పాత్ర కీలకమని, పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, కార్మికుల భద్రతను కాపాడుతూ, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు, చండూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కోడి గిరిబాబు, కోడి వెంకన్న,లింగయ్య, పున్న సైదులు, లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>