వరల్డ్ బ్యాడ్మింటన్: ఢిల్లీ స్టేడియం కొత్త రూపం!

కలం, స్పోర్ట్స్: సుదీర్ఘంగా 17 ఏళ్ల విరామం తర్వాత భారత్‌లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఆగస్టు 17 నుంచి ప్రారంభమయ్యే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌కు (BWF World Championships) ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం (Indira Gandhi Indoor Stadium) సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొత్త రంగులు, ఆకర్షణీయమైన లైటింగ్, ఆధునిక వసతులతో స్టేడియాన్ని సిద్ధం చేశారు. టోర్నీ సందర్భంగా క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా పావురాలు, కోతుల వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగకుండా వినూత్న చర్యలు చేపట్టారు.

ఇండియా ఓపెన్ ఘటనలతో అప్రమత్తం

ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్ సందర్భంగా పావురాలు మ్యాచ్‌లకు అంతరాయం కలిగించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. హెచ్‌ఎస్ ప్రణయ్, లోహ్ కీన్ యూ మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో పావురాలు కోర్టులోకి రావడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో ప్రాక్టీస్ ప్రాంతాలలో అపరిశుభ్రతపై డెన్మార్క్ క్రీడాకారిణి మియా బ్లిచ్‌ఫెల్డ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విమర్శలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఖండించినప్పటికీ.. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి నుంచే క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాట్లపై దృష్టి సారించాయి. మే నుంచి సీపీడబ్ల్యూడీ సిబ్బంది పనులను మరింత వేగవంతం చేశారు.

పావురాలు వాలకుండా ప్రత్యేక జెల్

పావురాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన జెల్‌ను స్టేడియం పైకప్పుపై పూశారు. ఆముదంతో తయారు చేసిన ఈ జెల్‌పై పక్షులు వాలగానే జారిపోయేలా పనిచేస్తుంది. దీంతో పైకప్పుపై పావురాలు గూళ్లు ఏర్పాటు చేయడం, అక్కడే ఉండటం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా అమెరికా నుంచి  ఆరు ప్రత్యేక సౌండ్ మెషిన్లను తెప్పించి స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇవి క్రూర పక్షుల శబ్దాలను విడుదల చేయడం ద్వారా పావురాలను భయపెట్టి దూరంగా ఉంచుతాయి. గత 15-20 రోజులుగా నిర్వహించిన పరీక్షలలో ఈ పరికరాలు సమర్థంగా పనిచేసినట్లు అధికారులు తెలిపారు.

కోతుల కోసం డబుల్ డోర్ వ్యవస్థ

పావురాలతో పాటు కోతులు స్టేడియంలోకి ప్రవేశించకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కేడీ జాధవ్ స్టేడియంలో డబుల్ డోర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పావురాలు లోపలికి రాకుండా వెంటిలేటర్లను కూడా మూసివేశారు. 17 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులు, అభిమానులకు మెరుగైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా నిర్వాహకులు సిద్ధమయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>