కలం, నిజామాబాద్ బ్యూరో: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) బ్యాక్ వాటర్లో ముంపునకు గురైన పాత కుస్తాపురం రామ లింగేశ్వరస్వామి ఆలయ (Ramalingeshwara Temple) శిఖరం బయటపడింది. నాలుగు నెలలకు ముందే తేలింది. సాధారణంగా ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయ శిఖరం కనిపించేది. ఈసారి నవంబర్లో శిఖరం తేలింది. ఎల్ నినోతో ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు సగం మాత్రమే నిండింది. మరోవైపు సాగు తాగు నీటి అవసరాలకు కాల్వలు, పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం, చిన్నఎత్తిపోతల పథకాలను వినియోగిస్తుండడంతో ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా తగ్గుతున్నది.
2019 తర్వాత ఇప్పుడే..
డొంకేశ్వర్ మండలం చిన్నయానం వద్ద జలగర్భంలో మునిగిన రామలింగేశ్వర స్వామి ఆలయం (Ramalingeshwara Temple) చివరగా 2019లో ప్రాజెక్టు నీటిమట్టం అడుగంటడంతో పూర్తిగా బయటపడింది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం కారణంగా కొద్దిరోజుల్లో ప్రాజెక్టులో నీరు మరింత తగ్గితే ఆలయం పూర్తిగా బయటపడొచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. 1970లో గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మించినప్పుడు పాత కుస్తాపూర్తో పాటు శతాబ్దాల నాటి ఆలయం కూడా ముంపునకు గురైంది. అప్పటినుంచి నీళ్లలోనే ఆలయం ఉండిపోయింది. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయిన వేసవిలోనే బయటకు కనిపిస్తుంది. ప్రధాన రామలింగేశ్వర స్వామి గుడితో పాటు దశరథ, భవానీ వంటి మరో ఆరు చిన్న ఆలయాలు కూడా నీటి అడుగున ఉంటాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు సుమారు 300 బ్రాహ్మణ కుటుంబాలు కుస్తాపూర్లో నివసించేవి. ముంపుతో గ్రామస్తులకు జగిత్యాల జిల్లా మెట్పల్లి సమీపంలోని మల్లాపూర్ వద్ద పునరావాసం కల్పించారు.
ఈసారి సందర్శన సాధ్యమే
ప్రాజెక్టులో బుధవారం నాటికి 33 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. తాగు, సాగు నీటి అవసరాలకే విడుదల చేస్తున్నారు. మరోవైపు ఇదే రోజున గతేడాది పూర్తిగా నిండు కుండలా 80 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. జూన్ నుంచి బుధవారం వరకు 25 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఈసారి ఎల్ నినో ప్రభావంతో ప్రాజెక్టులో జలకళ తప్పింది. తద్వారా ఆలయానికి అరుదుగా లభించే దర్శనం ఈసారి భక్తులకు కలిసి వచ్చేలా ఉంది. నీటి మట్టం పూర్తిగా తగ్గి ఆలయం బయటపడిన సమయంలో చుట్టుపక్కల జిల్లాల భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి ఇప్పటివరకు కేవలం నాలుగైదు సార్లు మాత్రమే ఆలయం బయటపడింది. 2019లో చివరిసారి బయట పడిన సందర్భంగా ఆలయం వరకు ఆర్టీసీ బస్సులు కూడా నడిపారు. బైకులు కార్లలో భక్తులు వెళ్లే అవకాశం ఉంటుంది.
Also Read : గుకేశ్ వర్సెస్ సిందరోవ్.. విశ్వవిజేతగా నిలిచేదెవరు?
Follow Us On: Youtube

