కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు జిల్లా కేంద్రంలోని మినీ శిల్పారామం నిర్వహణ బాధ్యతను టూరిజం శాఖకు అప్పగించాలని మాజీ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. శనివారం ఆయన మినీ శిల్పారామాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. తమ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు ధీటుగా శిల్పారామం నిర్మాణం చేశామన్నారు. కుల వృత్తులతో పాటు చేనేత కార్మికులకు తక్కువ ధరతో వ్యాపారం చేసుకునేందుకు షాపుల నిర్మాణం చేశామని తెలిపారు. చిన్న పిల్లల పార్కు ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశామని, ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడం లేదని ఆరోపించారు. శిల్పారామం టూరిజం ప్రాపర్టీ కానప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ వ్యక్తులకు ఎలా లీజ్‌కు ఇచ్చిందని నిలదీశారు. నిర్వహణ బాధ్యత మున్సిపల్ వాళ్లకు చేత కాకపోతే టూరిజం శాఖకు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
10 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు…
చెరువు కట్ట మీద ముడా నిధులతో షాపుల నిర్మాణం చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. రెవెన్యూ యాక్ట్ కింద అధికారుల నుంచి రికవరీ చేయిస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసేందుకు 10 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని.. ఏసీబీ అధికారులు దృష్టి సారించాలని కోరారు. పట్టణం నడిబొడ్డున ఉన్న శిల్పారామాన్నికేవలం లక్ష రూపాయల రెంటుకు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. ఈ సందర్శనలో గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ ఛైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు జ్యోతి, సత్యం, నవకాంత్, ఈశ్వరయ్య, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గణేష్, సీనియర్ నాయకులు జహంగీర్, నరేష్, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, సాయిలు, క్రాంతి పాల్గొన్నారు.

