కలం, వెబ్ డెస్క్ : త్రిపురలోని ఆషాబరి, బోక్సానగర్ సమీపంలో భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ స్థానిక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది (Tripura BSF Jawans)పై సుమారు వంద మందికి పైగా ఉన్న స్థానిక గుంపు కర్రలు, వెదురుబొంగులతో దాడికి పాల్పడింది.
సరిహద్దులో అక్రమ రవాణాను అడ్డుకుంటున్న సమయంలో కంపెనీ కమాండర్ (అసిస్టెంట్ కమాండెంట్) సహా ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్ల వాహనాన్ని ఈ మూక చుట్టుముట్టింది. విచక్షణారహితంగా దాడి చేయడంతో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. అంతేకాకుండా, వారి వద్ద ఉన్న ఆయుధాలను లాక్కునేందుకు ప్రయత్నించడంతో పాటు వాహనాన్ని ధ్వంసం చేశారు. దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

