కలం, వెబ్ డెస్క్: ఏపీలో మురసు తుఫాను (Murasu Cyclone) ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం వద్ద తెల్లవారుజామున తుఫాను తీరం దాటింది. దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం, మార్కాపురం, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 12.8 సెంటీమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 10.2 సెంటీమీటర్లు, కోనసీమ జిల్లాలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.
సీఎం సమీక్ష..
మురసు తుఫాను (Murasu Cyclone) తీరం దాటడంతో ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు.

