కలం, కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ స్థానిక కేబుల్ బ్రిడ్జి సమీపంలో వేంచేసియున్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో (Sri Bangaru Maisamma Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు సకల వేదాల మాత అయిన శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపకులు నారదాసు వసంతరావు సమక్షంలో ఆలయ అర్చకుల మంత్రోచ్చారణలు, వేద పఠనాల నడుమ అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు మరియు సహస్ర నామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
గాయత్రి దేవి అవతారంలో మెరిసిపోతున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు తారక మంత్ర పఠనంతో తరించిపోయారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు నారదాసు వసంతరావు మాట్లాడుతూ… “లోక కళ్యాణార్థం, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ప్రతి ఏటా లాగే ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం.
జ్ఞానాన్ని, సద్బుద్ధిని ప్రసాదించే గాయత్రి దేవి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు, పూజలు కొనసాగుతాయి” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

