కొండమల్లేపల్లి ఎస్పీఆర్ హైస్కూల్‌పై చర్యలకు డిమాండ్

కలం, దేవరకొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి (Kondamallepalli) మండల కేంద్రంలోని ఎస్పీఆర్ హైస్కూల్ (SPR High School) యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల, హాస్టల్ నిర్వహిస్తోందని నాయకులు ఆరోపించారు. అనుమతులు లేని అక్రమ హాస్టల్‌ను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ పవన్ కుమార్‌కు ఆర్‌టిఐఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేతావత్ బాబురామ్ నాయక్, వైఎస్ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎండి. సిరాజ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాల అక్రమాలపై గతంలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం, చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కనీస ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండానే వందలాది మంది విద్యార్థులతో హాస్టల్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హాస్టల్‌ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

పాఠశాల పేరు మార్పు, గుర్తింపునకు సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు, కమర్షియల్ కోర్టు పరిధిలో విచారణలో ఉందని నాయకులు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పాఠశాలను ఏ అధికారంతో కొనసాగిస్తున్నారో విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వకంగా వెల్లడించాలని కోరారు. అనుమతులు లేని ప్రవేశాలు, బోర్డుల ఏర్పాటు, తరగతుల నిర్వహణను వెంటనే నిలిపివేయాలని, కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యల నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లోగా విద్యాశాఖ అధికారులు స్పందించాలని, వారం రోజుల్లోగా పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే అధికారులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తామని బాబురామ్ నాయక్ హెచ్చరించారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఫిర్యాదు చేసి చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>