గాంధీ జయంతి.. తాజాపూర్‌లో ప్రత్యేక గ్రామ సభ

కలం, యాదాద్రి భువనగిరి: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భువనగిరి మండలం తాజాపూర్ (Tajpur) గ్రామ పంచాయతీలో శుక్రవారం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకాల సంతోష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి VB-G RAM-G, గ్రామీణాభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వం డైరెక్టర్ పి. శివ శంకర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తదితర అధికారులు హాజరయ్యారు. తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలు, వర్టికల్ సోక్ పిట్లు, పాఠశాలలోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్‌లను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా పి. శివ శంకర్ మాట్లాడుతూ.. జూన్ 2027 వరకు గ్రామంలోని కూలీలకు నిరంతర ఉపాధి కల్పించేలా ముందస్తుగా పనులను గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామంలోని సహజ వనరులు, భౌగోళిక పరిస్థితులు, ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్‌లను రూపొందించి పనులను శాస్త్రీయంగా గుర్తించాలని తెలిపారు.

ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, కమ్యూనిటీ సోక్ పిట్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు, బోర్ రీచార్జ్ పిట్లు, చెక్ డ్యామ్‌లు వంటి నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు పనులను గ్రామ అవసరాలకు అనుగుణంగా గుర్తించి, గ్రామ సభ ఆమోదంతో VB-G RAM-G ప్రణాళికలో చేర్చాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వర్షాధార పంటలపై పూర్తిగా ఆధారపడకుండా పంట మార్పిడి విధానాలను అవలంబించాలని సూచించారు. జల సిరి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి ప్రణాళికను రూపొందించి అమలు చేసుకోవాలని, గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. గ్రామ సభలో VB-GRAM-G కార్యక్రమ లక్ష్యాలు, గ్రామీణ ఉపాధి అవకాశాలు, నీటి సంరక్షణ పనుల ప్రాధాన్యత, సహజ వనరుల అభివృద్ధి, గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సూచనలు, అభిప్రాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాధాన్యతలను వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, VB-G RAM-G అధికారులు, జిల్లా అధికారులు, MPDO జి. విజయలక్ష్మి, మండల పంచాయతీ అధికారి దినకర్, ఉప సర్పంచ్ వారిగంటి కృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>