స్మార్ట్ రేష‌న్ కార్డుల్లో తప్పులు.. లబ్ధిదారుల తిప్పలు

క‌లం, మెద‌క్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల్లో ప‌లు ముద్రణా తప్పులు, సాంకేతిక లోపాలు బ‌యట‌ ప‌డుతున్నాయి. పలు ప్రాంతాల్లో గ్రామాల పేర్లు, లబ్ధిదారుల పేర్లలో తప్పులు దొర్లడంతో కార్డులు అందుకున్న ప్రజలు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒక ఊరి కార్డులపై మరొక ఊరి పేరు ముద్రితం కావడం, కుటుంబ సభ్యుల పేర్లలో దొర్లిన తప్పులతో అసలైన అర్హులు ఆందోళన చెందుతున్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పుగా ముద్రణలు..

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని సంగారెడ్డి ప‌ట్ట‌ణం నుండి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కొత్త‌గా స్మార్ట్ రేష‌న్ కార్డుల పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ప్రతి రేష‌న్ ల‌బ్ధిదారులకు కుటుంబ వివరాల‌తో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెద‌క్ జిల్లా వ్యాప్తంగా 520 రేష‌న్ షాప్ లు ఉండ‌గా, మొత్తం 242353 రేష‌న్ కార్టులు ఉన్నాయి.

అయితే మెద‌క్ జిల్లాలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల్లో త‌ప్పులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కొల్చారం మండలంలోని వ‌రిగుంతం గ్రామంలోని 13వ రేషన్ షాప్ డీలర్ పరిధిలో మొత్తం 480 రేషన్ కార్డులు ఉన్నాయి. గ్రామపంచాయతీ ఆవరణలో జిపిఓ సమక్షంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగ‌ళ వారం రోజున‌ నిర్వహించారు. జిపిఓ చేతుల మీదుగా గ్రామంలోని ల‌బ్ధిదారులకు స్మార్ట్ కార్డుల‌ను పంపిణీ చేశారు.

తీరా చేతికివ‌చ్చిన‌ కార్డులు చూసిన ల‌బ్ధిదారులు, గ్రామ‌స్తుల‌ు, స్థానిక ప్ర‌జానిధులు షాక్ అయ్యారు. వరిగుంతం గ్రామానికి సంబంధించిన రేషన్ కార్డుల్లో గ్రామం వ‌ద్ద‌ ‘వరిగుంతం’ పేరుకు బదులుగా కొల్చారం’ అని ముద్రించారు. కొత్త‌గా ఇచ్చిన స్టార్మ్ రేష‌న్ కార్డులలో త‌మ‌ గ్రామం పేరు తప్పుగా ఉండటం వెలుగులోకి రావడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కార్డుల పంపిణీ నిలిపివేయడంతో లబ్ధిదారులు నిరాశ వ్యక్తం చేయడంతో పాటు త‌ప్పుల‌ను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

తూప్రాన్ మున్సిపాలిటీ 4వ వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సైతం గందరగోళానికి దారితీసింది. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో నాల్గ‌వ‌ వార్డులోని షాప్ నంబర్ 14కు చెందిన లబ్దిదారులకు స్మార్ట్ రేషన్‌ కార్డుల పంపిణీకి కార్య‌క్ర‌మంకు మున్సిప‌ల్ చైర్మ‌న్, కౌనిల‌ర్లు, మున్సిపాల్ అధికారులు హాజరయ్యారు. కొత్త స్మార్ట్ కార్డుల‌ను పంపిణీకి సిద్ధం చేసి నిముషాల్లో కార్య‌క్ర‌మం మొద‌ల‌వుతుంద‌నే స‌మ‌యానికి, తీరా కార్డులను పరిశీలించగా, 4 వ వార్డు లబ్ధిదారుల వివరాల స్థానంలో తూప్రాన్ మండలంలోని వట్టూరు గ్రామం పేరు ముద్రించబడినట్లు గుర్తించారు.

తూప్రాన్ మున్సిపాల్ ప‌రిధిలోని వార్డులో గ్రామం పేరును ముద్రించ‌డంతో తప్పిదాన్ని గుర్తించిన ప్రజాప్రతినిధులు అధికారులు, వెంటనే కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే పంపిణీ సమయంలో కార్డులపై ఉన్న వివరాలు త‌ప్పులు దొర్ల‌డం, కార్య‌క్ర‌మం నిలిచిపోవ‌డంతో స్థానికులు అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్డుల్లో త‌ప్పులు దొర్లడం పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి సమన్వయ లోపానికి నిదర్శనమని లబ్ధిదారులు విమర్శించారు.

తప్పులను సరిదిద్దాలి :

ప్ర‌సుత్తం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేష‌న్ కార్డుల్లో కేవలం ఊరు పేర్లు త‌ప్పుగా ముద్ర‌ణ కావ‌డ‌మే కాకుండా ల‌బ్ధిదారులు వ్య‌క్తిగ‌త వివరాలు, కుటుంబ స‌భ్యుల వివ‌రాలు త‌ప్పుగా ముద్రితమవుతున్నాయి. కొత్తగా ఇస్తున్న స్మార్ట్ రేష‌న్ కార్డుల్లో పేర్లు, త‌మ కుటుంబ స‌భ్యుల వివరాలు త‌ప్పుగా రావ‌డంతో లబ్ధిదారులు అందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం గొప్ప‌గా చెప్ప‌కుంటున్న స్టార్మ్ రేష‌న్ కార్డుల వివరాల‌ల్లో త‌ప్పులు దొర్లడంపై అధికారుల తీరుపై అగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్మార్ట్ రేష‌న్ కార్డుల‌లో త‌ప్పులు దొర్ల‌తే జీవిత‌కాలం ఇబ్బందులు ఎదుర్కొవ‌ల్సి రావ‌డంతో పాటు , కార్డుపైను ఉన్న‌ త‌ప్పుల‌ను దిద్దుబాటు చేసుకొవ‌డం కోసం అధికారుల చుట్టు తిర‌గ‌ల్సి వ‌స్తుందని వాపోతున్నారు.

సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు . స్మార్ట్ రేష‌న్ కార్డుల ముద్ర‌ణ‌ సమస్యపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తప్పిదాన్ని సరిదిద్దాలని, సరైన వివరాలతో కొత్త స్మార్ట్ కార్డులను అందించాలని డిమాండ్ చేశారు. ఇంకా వేలాది కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీకి సిద్ధంగా ఉన్ననేప‌ధ్యంలో రేషన్ కార్డులలో దొర్లిన తప్పులను ముందుగానే గుర్తించి, వాటిని త్వరలోనే సవరించి లబ్ధిదారులకు త‌ప్పుల‌కు అవ‌కాశంలేని కొత్త‌ కార్డులను అందజేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>