కలం, మహబూబ్నగర్ బ్యూరో: జీవ నదుల చెంత జీవన్మరణ సమస్యగా బతుకులు వెళ్లదీసిన పాలమూరు రైతాంగానికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ కోదండరాం (Kodandaram) హెచ్చరించారు. కృష్ణానది జలాలను డిండి ప్రాజెక్టు ద్వారా నల్గొండ జిల్లాకు తరలించడాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. మంగళవారం మహబూబ్నగర్ టీటీడీ కల్యాణ మండపం సమీపంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు ,నియామకాల కోసమే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందని, తెలంగాణ ఏర్పడి ఇంతకాలమైనా ప్రజలకు జరగాల్సిన మేలు జరగలేదన్నారు.
ఏ లక్ష్యం కోసమైతే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నామో, ప్రస్తుతం పెండింగ్ ప్రాజెక్టులు సాధించడానికి సైతం అలాంటి తరహా ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రజల డిమాండ్ ను పాలకులు గుర్తించి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. సాధించుకున్న తెలంగాణలో ప్రాజెక్టుల పూర్తికి మరో ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు పాలకులు కల్పించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జేఏసీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, కరువు వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాఘవాచారి, బిజెపి రాష్ట్ర నాయకులు వీర బ్రహ్మచారి, చెన్న కృష్ణయ్య, అనీఫ్ అహ్మద్,ఎండి ఖలీల్, వామన్ కుమార్, గద్వాల, వనపర్తి ,నాగర్ కర్నూల్ ,నారాయణపేట జేఏసీ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.

