ఎస్‌ఐఆర్ నోటీసులపై కలెక్టర్ కీలక సూచనలు

కలం, నిజామాబాద్ బ్యూరో : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో(SIR Process) భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు వ్యక్తిగతంగా బూత్ లెవల్ అధికారులును (BLO) కలవలేని పక్షంలో ఆన్‌లైన్ ద్వారా వాట్సప్, ఈ-మెయిల్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలను పంపవచ్చని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. మ్యాపింగ్ జరగని ఓటర్లు, పేరు, ఇతర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న వారికి ఎస్‌ఐఆర్‌లో భాగంగా జారీ చేసిన నోటీసులపై పక్కాగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. అనర్హులుగా నిర్ధారణ అయిన వారికి స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఇంకా ఎవరికైనా నోటీసులు జారీ కాకపోతే వెంటనే అందజేయాలని అన్నారు.

నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఇంకా 6,106 మందికి నోటీసులు అందించాల్సి ఉందని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అత్యధికంగా 3,865 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆర్మూర్‌లో 1,631, బోధన్‌లో 16, బాన్సువాడ సెగ్మెంట్‌లో 437, బాల్కొండ నియోజకవర్గంలో 157 నోటీసులు ఇంకా అందించాల్సి ఉందని వివరించారు. వీరిలో అత్యధిక మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామాల్లో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. బీఎల్‌ఓలను క్షేత్రస్థాయిలో సంబంధిత ఓటర్ల ఇళ్లకు పదేపదే పంపిస్తూ నోటీసులు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలకు సమాచారం అందిస్తున్నామని, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాల నోటీసు బోర్డులపై కూడా సంబంధిత సమాచారాన్ని ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఓటర్లు బీఎల్‌ఓలను నేరుగా కలిసే అవకాశం లేనట్లయితే ఆన్‌లైన్ ద్వారా వాట్సప్, ఈ-మెయిల్‌లో సంప్రదించి ధ్రువీకరణ పత్రాలను పంపవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>