కలం, వెబ్ డెస్క్ : పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర స్పెషల్ మున్సిపాలిటీ పాఠశాల (Pithapuram School) ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఒకే ఒక్క బాలుడు చదువుకుంటున్నాడు. ఆ ఒక్క విద్యార్థి కోసమే జాతీయ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు పాఠశాల ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు.
స్కూల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని నిరాశ పడకుండా, ఆ ఒక్క బాలుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు మాస్టర్ నాగేశ్వరరావు ప్రత్యేకంగా వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, ఇతర పిల్లలు కలిసి సుమారు 30 మంది అతిథులు హాజరయ్యారు. ఒకే ఒక్క విద్యార్థి ఉన్నప్పటికీ, అందరి సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను పండుగ వాతావరణంలో జరిపారు. ఆ బాలుడి పట్ల ఉపాధ్యాయుడు చూపిన బాధ్యత, విధి నిర్వహణపై ఆయనకున్న అంకితభావం స్థానికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

