కలం, ఖమ్మం బ్యూరో : భూమికి వందల అడుగుల లోతున, ప్రకృతితో పోరాడుతూ, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చెమటను రక్తంగా మార్చి బొగ్గు తవ్విన వారు సింగరేణి (Singareni) కార్మికులు. దేశ పారిశ్రామిక రంగానికి పునాది వేయడంలో, కోట్లాది ఇళ్లకు వెలుగులు నింపడంలో వారి పాత్ర అమూల్యం. తమ యవ్వనాన్నంతా గని గర్భంలోనే అర్పించిన ఈ కార్మికులు, నేడు విశ్రాంత జీవితంలో మాత్రం తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన పీఎఫ్, గ్రాట్యుటీ డబ్బులు పిల్లల చదువులు, పెళ్లిళ్లతో కరిగిపోయాయి. వృద్ధాప్యంలో అనారోగ్యం వస్తే మందులు కొనడానికి కూడా చేతిలో పైసా లేని పరిస్థితి. ఒకప్పుడు వందల మందికి ఆదర్శంగా నిలిచిన వారు, నేడు సెక్యూరిటీ గార్డులుగా, కూరగాయలు, కిరాణా సరుకులు అమ్ముకుంటూ జీవనం సాగించడం హృదయ విదారకం.
రాష్ట్ర ప్రభుత్వం పేద వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్ కంటే కూడా సింగరేణి రిటైర్డ్ కార్మికులకు వచ్చే పెన్షన్లు(Pension Crisis) తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ వృద్ధుడికి రూ.2,016 పింఛన్ వస్తుండగా, జీవితాంతం కష్టపడ్డ కార్మికుడికి మాత్రం రూ.350 నుంచి రూ.1,500 మధ్యలో మాత్రమే రావడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1997కి ముందు రిటైర్డ్ అయిన వేలాది మంది కార్మికులు ఇప్పటికీ రూ.1000 కంటే తక్కువ పింఛన్‌తోనే జీవిస్తున్నారు. ఈ దుస్థితికి ప్రధాన కారణం దశాబ్దాలుగా మారని పాత నిబంధనలే.
1998లో ప్రవేశపెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ ప్రకారం రిటైర్మెంట్ సమయంలో బేసిక్, డీఏలో కేవలం 25 శాతం మాత్రమే పెన్షన్‌గా నిర్ణయించడం వల్ల, నేటి పరిస్థితులలో ఆ మొత్తంతో బతకడం అసాధ్యమైంది. ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్ సవరించాల్సి ఉన్నా, గత 28 ఏళ్లుగా అది జరగకపోవడం పరిస్థితిని మరింత విషమం చేసింది. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, కేంద్ర సంస్థ నుంచి పెన్షన్ వస్తుందనే కారణంతో రాష్ట్ర ప్రభుత్వ ఆసరా పింఛన్ కూడా ఈ కార్మికులకు వర్తించడం లేదు. దీంతో వారు రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఈ అన్యాయంపై సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ (Singareni Retired Employees), అసోసియేషన్ దశాబ్దాలుగా పోరాడుతోంది. నిరసనలు, వినతిపత్రాలు, పార్లమెంట్‌లో చర్చలు జరిగినా పరిష్కారం మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం కనీస పెన్షన్‌ను రూ.10,000కి పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వంగా. వెంకట్, ఏఐటీయూసీ నాయకులు, కొత్తగూడెం
సింగరేణి కార్మికుల పెన్షన్ సమస్య కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఇది మానవీయ అంశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించాలి. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ‘ఉమ్మడి పెన్షన్ పథకం’ ద్వారా గౌరవప్రదమైన కనీస పింఛన్‌ను అందించి, తమ జీవితాన్ని బొగ్గు గనులకు ధారపోసిన కార్మికుల విశ్రాంత జీవితాలలో నిజమైన వెలుగులు నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
పప్పుల. పద్మయ్య, మణుగూరు
నేను 1997లో రిటైర్డ్ అయ్యాను. నాకు పెన్షన్ రూ.500 కూడా రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ వృద్ధాప్య పింఛన్‌కు అప్లై చేసుకుందామంటే, అర్హత లేదని చెప్తున్నారు. పింఛను పైసలు మందులకు కూడా సరిపోవడం లేదు. డబ్బా కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాను.

